ఉమ్మడి పౌరస్మృతిపై బహిరంగ చర్చ జరగాల్సిందే

ఉమ్మడి పౌరస్మృతిపై బహిరంగ చర్చ జరగాలన్న ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె వ్యాఖ్యలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ మద్దతు తెలిపారు. మీడియాతో , ఉమ్మడి పౌర స్మృతిపై బహిరంగంగా మాట్లాడితే వచ్చే సమస్యేమిటని ప్రశ్నించారు.

ఏవైనా భయాలుంటే వాటిని తొలగించే ప్రయత్నం చేయాలని సూచించారు. అభివృద్ధికి దూరం చేస్తున్నారనే భయాలు తొలగాలన్నా, శాంతియుత వాతావరణం నెలకొనాలన్నా ఉమ్మడి పౌరస్మృతిపై బహిరంగ చర్చ జరగడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతిపై డిమాండ్ చాలా పాతదని కూడా ఆయన పేర్కొన్నారు.

‘ఉమ్మడి పౌరస్మృతిని భీమ్‌రామ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం నాలుగు సార్లు పైనే ఆదేశాలిచ్చింది. పౌరులకు ఉమ్మడి చట్టం లేని దేశం ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని జైన్ పేర్కొన్నారు. 

హిందూ ఎజెండాను బలవంతంగా రుద్దే ప్రయత్నంగా దీనిని కొందరు చెబుతున్నారని, అయితే హిందూ సమాజం తాము ఆచరించే ఎన్నో పద్ధతులను సవరించేందుకు అంగీకరించిన సందర్భాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని, ఆ విషయాన్ని మరువరాదని ఆయన గుర్తు చేశారు. 

కాగా, ఆర్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె ఆదివారంనాడు మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతిపై బహిరంగ చర్చ జరగాలని అన్నారు. అయితే, దీనిపై ఈ సమయంలో బిల్లు తీసుకు రావాలా, వద్దా అనే నిర్ణయం ప్రభుత్వానికే వదిలిపెడుతున్నట్టు ఆయన చెప్పారు.