
కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. నెహ్రూ-గాంధీ వంశం ఏనాడూ ప్రధాని కార్యాలయాన్ని గౌరవించలేదని విమర్శించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
పేదరికంలో పుట్టి ప్రధానిగా మారిన మోదీపై ఒక వంశం వ్యక్తిగతంగా ద్వేషాన్ని పెంచుకుంటోందంటూ నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి నడ్డా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై దేశ ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మోదీని కాంగ్రెస్ ఎంతగా విమర్శిస్తూ, అబద్ధాలు, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందో అంతగా ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారని వివరించారు.
ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టిన సంఘటనకు రాహుల్‌గాంధీయే ప్రధాన కారకుడని ఆరోపించారు. “రాహుల్ గాంధీ దర్శకత్వం వహించిన నాటకం పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని దిష్టిబొమ్మను కాల్చడం సిగ్గుచేటు. కానీ, ఇది ఊహించనిది కాదు. నెహ్రూ-గాంధీ వంశం ప్రధాని కార్యాలయాన్ని ఎన్నడూ గౌరవించలేదు. యూపీఏ సమయంలో ప్రధాని అధికారాన్ని సంస్థాగతంగా బలహీనపరచడంలో కనిపించింది” అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
“నిరాశ, సిగ్గులేని కలయికను కాంగ్రెస్ కలిగివున్నది. రాజస్థాన్‌లో దళిత వర్గాల ప్రజలపై జరుగుతున్న దారుణాలు జరుగుతున్నా కాంగ్రెస్ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. రాజస్థాన్‌తో పాటు పంజాబ్‌లో మహిళలు సురక్షితంగా లేరని అన్నారు. పంజాబ్ మంత్రులు స్కాలర్‌షిప్ మోసాలకు పాల్పడుతున్నారు” అని నడ్డా పేర్కొన్నారు.
కేంద్రం యొక్క కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆదివారం జరిగిన దసరా వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని రైతు సంస్థలు ప్రధాని మోదీ, వ్యాపార వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల దిష్టిబొమ్మలను తగులబెట్టారు.
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు వాక్ స్వేచ్ఛను అణచివేశారని, ప్రజాస్వామ్యాన్ని అడ్డదారిలో ఉంచారని నడ్డా ధ్వజమెత్తారు. వాక్ స్వాతంత్య్రంపై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రధాన మంత్రి కార్యాలయాన్ని నెహ్రూ-గాంధీ కుటుంబం అగౌరవపరించిందని ఆరోపించారు.
‘వాక్ స్వేచ్ఛపై కాంగ్రెస్ ఎన్నడూ ఇతరులను ధృవీకరించలేదు. దశాబ్దాలుగా అసమ్మతి స్వరాలను కాంగ్రెస్ అణచివేసింది. ఎమర్జెన్సీ సమయంలో దీనికి ఉదాహరణలుగా నిలిచే కొన్ని ఘటనలను చూశాం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను బలహీనపరిచేందుకు యత్నించింది’ అని నడ్డా ట్వీట్ చేశారు.
More Stories
చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు