తేజస్వికి కూడా రాడికల్ శక్తులతో సంబంధాలా?

కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్జేడీకి కూడా జమాతే ఇస్లామీ సహా బీహార్ రాడికల్ శక్తులతో సంబంధాలు ఉన్నాయో లేదో ఆ పార్టీ అధినేత  తేజస్వి యాదవ్ సమాధానం చెప్పాలని  కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయనీ.. ఆ పార్టీతో జతకట్టిన ఆర్జేడీకి కూడా వాటితో సంబంధాలు ఉన్నాయా అని ఆయన నిలదీశారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలని నఖ్వీ  స్పష్టం చేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్జేడీకి కూడా జమాతే ఇస్లామీ సహా బీహార్ రాడికల్ శక్తులతో సంబంధాలు ఉన్నాయో లేదో తేజస్వి సమాధానం చెప్పాలి. ఇవి దేశ భద్రతకు సంబంధించిన ప్రశ్నలు. రాజకీయాలతో సంబంధం లేదు…’’ అని పేర్కొన్నారు.

మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అగాడీ (ఎంవీఏ)లో కాంగ్రెస్‌కు శివసేన మిత్రపక్షంగా ఉన్నందున.. శివసేన కూడా దీనిపై తన వైఖరి తెలియజేయాలని నఖ్వీ డిమాండ్ చేశారు.

‘‘’సెక్యులర్  అని చెప్పుకుంటున్న పార్టీయే ఇప్పుడు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. వాళ్లు మాకు రకరకాల ప్రశ్నలు ట్వీట్ చేస్తున్నారు. కానీ ముందు సమాధానం చెప్పాల్సింది ఏమంటే… జమాతే ఇస్లామీ, పీఎఫ్ఐ సహా అలాంటి ఇతర శక్తులతో వారికి సంబంధాలు ఉన్నాయా లేవా?’’ అని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.

తీవ్రవాద శక్తులను కాపాడడంలో’’ కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు పోటీ పడుతున్నాయనీ ధ్వజమెత్తుతూ దేశ భద్రత గురించి గానీ, అలాంటి రాడికల్ శక్తులను తుడిచిపెట్టడం మీద గానీ వారికి కనీసం పట్టింపు లేదని మండిపడ్డారు.