అధికారంకోసం హిందుత్వంతో  ఉద్ధవ్ రాజీ 

ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే అధికారం చేపట్టి 11 నెలలు గడుస్తున్నా మహారాష్ట్రకు ఆయన చేసిందేమీ లేదని బీజేపీ విమర్శించింది. అధికారం కోసం హిందుత్వంతో రాజీ పడుతున్నారని అంటూ మండిపడింది. 
 
తమ పనుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వల్లే.. శివసేన దసరా వార్షిక ర్యాలీలో సీఎం ఉద్ధవ్ బీజేపీ మీద, కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ ధ్వజమెత్తారు. 
 
‘‘అధికారం కోసం శివసేన హిందూత్వ వాదం విషయంలో రాజీపడింది. కాంగ్రెస్ పార్టీ సావర్కర్‌ను తిడుతున్నా పల్లెత్తుమాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు అదే సావర్కర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి ప్రసంగించాల్సి వచ్చింది..’’ అని కేశవ్ ఎద్దేవా చేశారు. 
 
రైతులను ఎగతాళి చేసేలా ప్రభుత్వం కేవలం రూ.10 వేల కోట్లతో ప్యాకేజీ వెలువరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీఎస్టీ ప్రతిపాదనపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదంటూ ఆయన ప్రశ్నించారు. 
 
అంతకు ముందు, ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా శివసేన నిర్వహించే వార్షిక సమావేశంలో ఆయన డుతూ తాను  ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజు నుంచి తమ ప్రభుత్వం పడిపోతుందని కొందరు పదే పదే చెబుతున్నారని విమర్శించారు. 
 
‘ఇప్పుడు నేను సవాల్ చేసి చెబుతున్నా.. మీకు దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించండి’ అని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.