సుశీల్ మోదీని చంపేందుకు లాలూ చేతబడి 

సుశీల్ మోదీని చంపేందుకు లాలూ చేతబడి 
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ జాతీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్  తనను చంపేందుకు కుట్ర పన్నిన్నట్లు తీవ్రమైన ఆరోపణ చేసారు. మూడేండ్ల క్రితం తాంత్రిక కర్మలు (చేతబడి) చేశారని వెల్లడించారు.
లాలూ యాదవ్ జీవనశైలి గురించి, చేతబడిపై ఆయనకున్న గట్టి నమ్మకం గురించి, మోదీ పలు ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై సుశీల్ కుమార్ మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఆరోపణలు గుప్పించారు.
లాలూ ప్రసాద్ మూఢనమ్మకాలను ఎంతో నమ్ముతారని, తాంత్రికుల ఆదేశాల మేరకు తెల్ల కుర్తా ధరించడం మానేయడమే కాకుండా, తాంత్రిక శంకర్ చరణ్ త్రిపాఠీని ఆర్జేడీ జాతీయ ప్రతినిధిగా చేశారిని చెప్పారు.
 “అదే తాంత్రిక మీర్జాపూర్ లోని వింధ్యాచల్ ధామ్ వద్ద లాలూ ప్రసాద్ కోసం తాంత్రిక పూజలు చేసారు. మూడేండ్ల క్రితం నన్ను చంపడానికి వారు చేతబడి కూడా చేశారు” అని సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు.
ఆర్జేడీ అధినేత ప్రజలను నమ్మలేదని, అందువల్లనే తంత్ర-మంత్రం, జంతు బలి, ఆత్మలను ప్రార్థించడం వంటి ఆచారాలను చేస్తూనే ఉన్నాడని ధ్వజమెత్తారు. అయినప్పటికీ, అతను జైలు నుంచి తప్పించుకోలేరు లేదా తన శక్తిని ఆదా చేయలేరని, ఇంకా 14 సంవత్సరాలు జైలు జీవితం గడపవలసిందే అని స్పష్టం చేశారు. 
 
కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాంచీలోని కైలీ బంగ్లాలో, జైలు మాన్యువల్‌ను ఉల్లంఘిస్తూ నవమి రోజున లాలూ మూడు మేకలను బలి ఇవ్వబోతున్నారని మోదీ ఆరోపించారు. “కొన్ని అట్టడుగు పార్టీల నుంచి పొత్తులు, పెద్ద పెద్ద వాగ్దానాలు తన పార్టీని కాపాడలేవని ఆయన గ్రహించారు” అని మోదీ దుయ్యబట్టారు.