ఏపీలో బిజెపి బలోపేతం అవుతుంది 

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి మరింతగా బలోపేతం అవుతుందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని దసరా పర్వదినం సందర్భంగా సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు అనంతరం ఆరంభించారు.
 
ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణానది తీరాన, కనకదుర్గమ్మ పాదాల చెంతన…దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకున్నాం. ప్రజలందరికీ మంచి జరగాలి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ దుర్గమ్మను దర్శించుకుని, కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నా’ అని తెలిపారు. 
ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని, ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని ప్రకటించారు. కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు.
దేశంలో అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ కూడా తమదే అని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్నా, లేకున్నా బీజేపీ నేతలు కుటుంబంలా కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మోదీ సారధ్యంలో పని చేస్తామని తెలిపారు.

సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉంటూ నేడు అధ్యక్షులుగా పని చేస్తున్నారని చెబుతూ ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌ షా తరపున ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అన్నారు.