గీతం కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు స్టే

విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు నిర్మాణాల కూల్చివేతపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. అంతేకాదు కూల్చివేతలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్థరాత్రి 100 మంది పోలీసులతో నిర్మాణాలు కూల్చివేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. 
 
నోటీసులు, ఆర్డర్లు లేకుండా కూల్చడం సరికాదని పిటిషనర్‌ తెలిపారు. యూనివర్సిటీ ప్రైవేట్‌ భూముల్లో నిర్మాణాలు కూల్చారని పిటిషనర్‌ తెలిపారు. అదనపు భూమి కొనడానికి డాక్యుమెంట్‌ ప్రభుత్వం వద్దే ఉందని పిటిషనర్‌ చెప్పారు. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది. 
 
 ఇప్పటికే విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత వ్యవహారంలో తదుపరి చర్యలను సోమవారం వరకు నిలుపుదల చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.  దీనిపై పూర్తిస్థాయి విచారణ ఆదివారం చేపడతామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 
 
కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అధికారులు అక్రమంగా వర్సిటీ కట్టడాలను కూల్చివేస్తున్నారని, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా హఠాత్తుగా కూల్చివేతలకు దిగారంటూ వర్సిటీ యాజమాన్యం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవె న్యూ, గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్ ‌(జీవీఎంసీ) అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. ప్రభుత్వ భూమి ఉన్నదంటూ ఎక్స్‌కవేటర్‌లతో పలు కట్టడాలను తొలగించారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ శనివారం ఉదయం 11 వరకు కొనసాగింది.