గీతం వివాదంలో చంద్రబాబు, బాలకృష్ణ నిర్లిప్తత!

ఆక్రమణల తొలగింపు పేరుతో గ్రేటర్  విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గీతం యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేతకు పాల్పడితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గాని, ఆయన వియ్యంకుడు, బావమరిది నందమూరి బాలకృష్ణ 

నిర్లిప్తతతో వ్యవహారించడం ఆసక్తి కలిగిస్తున్నది. ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనమని అంటూ ఒక విమర్శ చేసి టిడిపి అధినేత ఊరుకున్నారు.  
 
గీతం యూనివర్సిటీ అధిపతి శ్రీ భరత్ లోకేష్ కు తోడల్లుడు కాగా, బాలకృష్ణకు అల్లుడు. పైగా అతని తండ్రి, మాజీ ఎంపీ దిగవంత ఎంవివిఎస్ మూర్తి చంద్రబాబునాయుడుకు సన్నిహితుడిగా పేరొందారు. సుమారు రూ 800 కోట్ల విలువ గల 40 ఎకరాల భూములను గీతం సంస్థలకు ఆక్రమించుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. 
 
వాస్తవానికి ఈ భూముల ఆక్రమణను క్రమబద్దీకరించామని ఎంవివిఎస్ మూర్తి ఉన్నప్పటి నుండే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని తెలుస్తున్నది. కేవలం చంద్రబాబు ప్రభుత్వపు నిర్వాకం కారణంగానే ఇప్పుడు తాము అల్లరి కావలసి వస్తున్నదని శ్రీ భరత్ మండిపడుతున్నట్లు చెబుతున్నారు. 
 
మరోవంక బాలకృష్ణ పట్ల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సదభిప్రాయం ఉన్నదని, మామ గారు పట్టించుకున్న ఈ విధంగా కూల్చివేతలు అధికారులు పాల్పడి ఉండేవారు కాదని శ్రీ భరత్ ఆగ్రహం చెందుతున్నట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ ఎందుకని మౌనంగా ఉన్నారో టిడిపి వర్గాలకు అంతుబట్టడం లేదు. 
 
ఈ విధంగా అడ్డదిడ్డంగా ప్రభుత్వం భూములను ఆక్రమించుకోవడం పట్ల వీరిద్దరూ కూడా ఎంవీవీఎస్ మూర్తి పట్ల అసహనంగా ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.  కేవలం శ్రీ భరత్ చంద్రబాబుకు సన్నిహిత బంధువు కావడమే కాకుండా, గత ఎన్నికలలో విశాఖ నుండి లోక్ సభ కు పోటీ చేసి ఓటమి చెందడంతోనే అధికారులు కూల్చివేతలు పాల్పడ్డారని భావిస్తున్నారు.
 
పైగా, ఈ కూల్చివేతలను కక్షసాధింపు చర్యలు అంటూ టిడిపి నేతలు రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరింపక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల పట్ల శ్రీ భరత్ ఖంగు తిని, మౌనంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నది. 
 
ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ప్రాంతంలో టిడిపి వ్యవహారాలపై చాలాకాలం ఆధిపత్యం వహిస్తూ, ఇతర నాయకులు ఎవ్వరిని ఎదగకుండా అడ్డుకోనేవారనే ప్రతీతి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్య కారణంగా స్థానిక టిడిపి వర్గాలలో సహితం చెప్పుకోదగిన సానుభూతి వ్యక్తం కావడం లేదని చెబుతున్నారు.