పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి  కూడా తాము ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. 

వాస్తవ అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిధులు ఇస్తుందని మాధవ్ పేర్కొన్నారు. సాంకేతికత పేరుతో పోలవరం అంచనాలను అమాంతం పెంచేశారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో గీతం యూనివర్సిటీ ఘటనపైనా స్పందించారు. 

గీతం యూనివర్సిటీ విషయంలో అనుసరించిన విధానాన్ని అన్ని అక్రమ కట్టడాల విషయంలోనూ అనుసరించాలని మాధవ్  డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలపై ఒకే పాలసి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. 

ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్లుగా కనిపిస్తోందని మాధవ్ ధ్వజమెత్తారు. ప్రజా వేదిక తరువాత ఏ అక్రమ కట్టడాలు కూల్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.