అట్టుడికి పోతున్న వ్యవసాయ రంగం 

అట్టుడికి పోతున్న వ్యవసాయ రంగం 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం అట్టుడికిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపదారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దోమపోటుతో దెబ్బతిన్న వరికి నిప్పు పెట్టిన రైతు దేవరాజు పొలాన్ని పరిశీలించేందుకు శనివారం బీజేపీ జిల్లా నాయకులు వెళ్లారు. అదే సమయంలో బండి సంజయ్‌ దేవరాజుతో ఫోన్‌లో మాట్లాడారు.

దోమపోటు కారణంగా రెండెకరాల వరి పంటకు రైతు దేవరాజు నిప్పు పెట్టిన విషయం పత్రికల్లో చూసి బాధపడ్డానని చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం ఉండగా, ప్రభుత్వం బలవంతంగా 30 లక్షల ఎకరాల్లో సన్నరకం వడ్లను సాగు చేయించిందని సంజయ్ మండిపడ్డారు.

తెలంగాణలో ఎక్కడా భూసార పరీక్షలు నిర్వహించకుండా, నిర్బంధంగా సన్న రకం వరి సాగు  చేయించారని సంజయ్ విమర్శించారు. మక్కల కొనుగోలు విషయంలో కేసీఆర్‌ సర్కారు రైతులను గందరగోళానికి గురిచేస్తోందని సంజయ్‌ ఆరోపించారు. తాము చెప్పిన పంటనే సాగు చేయాలంటూ అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు.

భూసార పరీక్షలు చేయకుండా నిర్బంధ సాగు విధానం అమలు చేయడం అశాస్ర్తీయం కాదా? అని ప్రశ్నించారు. ఏ భూమిలో ఏ పంట పండించాలో చెప్పకుండా మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ మాట నమ్మి.. సన్న రకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారని.. దీనికి ఎవరు బాధ్యులని నిలదీశారు.