బీహార్ అభ్యర్థులలో 31 శాతం మందికి నేర చరిత్ర 

బీహార్ అసెంబ్లీకి మొదటి దశపోలింగ్‌ అక్టోబరు 28న 71 స్థానాలకు జరుగుతుండగా, పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులలో 31 శాతం మందికి నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌’ (ఏడీఆర్‌) తాజా నివేదిక ప్రకారం, 328మంది అభ్యర్థులు (31శాతం) నేర చరిత్ర కలిగినవారున్నారు. 
 
ఇందులో 29మందిపై లైంగికదాడి, మహిళా హత్య, మహిళలపై నేరాలు వంటి ఆరోపణలున్నాయి. ఇద్దరు అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్‌ తప్ప, మిగతా 1064మంది అఫిడవిట్లను బీహార్‌ రాష్ట్ర ఎన్నికలసంఘం సరైన పరిశీలన జరప లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్జేడీకి చెందిన 41మంది తమకు నేర చరిత్ర ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
మొదటి దశ పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థులు 29మంది పోటీ చేస్తుండగా, అందులో 21మందికి నేర చరిత్ర ఉందని తేలింది. లోక్‌జన్‌శక్తి పార్టీ నుంచి 41మంది పోటీ చేస్తుండగా, 24మందికి నేర చరిత్ర ఉంది. కాంగ్రెస్‌ నుంచి 21మంది అభ్యర్థుల్లో 12 మందికి, జనతాదళ్‌ (యు) నుంచి 26 మంది అభ్యర్థుల్లో 8మందికి నేరచరిత్ర ఉంది.
‘క్రిమినల్‌ నేర చరిత్ర’ ఉన్నవారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు కొద్దినెలల క్రితం తప్పుబట్టింది. ఒకవేళ నేర చరిత్ర ఉన్నవాళ్లకు టికెట్లు ఇచ్చిన పక్షంలో, సంబంధిత రాజకీయ పార్టీ దానికిగల కారణాన్ని ఎన్నికల సంఘానికి తెలపాల్సి ఉంటుంది. 
 
ఇది ఫిబ్రవరి 13, 2020లో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల్లో కీలకమైంది. అయితే ఆ తర్వాత మొదటిసారిగా బీహార్ లో జరుగుతున్న ఎన్నికలలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు, మార్గదర్శకాలు అమలయ్యే పరిస్థితి కనపడటం లేదు.