కిషన్ రెడ్డి చొరవతో కేంద్రం రూ 202 కోట్ల విడుదల 

తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న రూ 202 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల కోసం పలుమార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి చర్చించారు. 

నిధులు విడుదల చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీకి కిషన్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని రోడ్లు దెబ్బతిన్న సమయంలో కేంద్రం నిధులు విడుదల చేయటం వల్ల మేలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో 8 జాతీయ రహదారులు 868 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటి నిర్వహణకు, మరమ్మత్తుల కోసం  రూ 202 కోట్ల అంచనాలను కేంద్రం  ఆమోదించింది. కేంద్రం విడుదల చేసిన నిధులు తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బి సమర్పించిన ప్రతిపాదనలకంటే 85 శాతం ఎక్కువగా ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 

వర్షాలతో దెబ్బతిన్న రహదారులు మరింత పాడవకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ నిధులను సద్వినియోగపర్చుకోవచ్చని ఆయన చెప్పారు. వరదలు, అకాల వర్షాలతో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర సర్కారు చేపట్టే మరమ్మతు, పునరావాస కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు.