తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ ప్రతీకని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో మహిళలకు గవర్నర్ చీరలను పంపిణీ చేస్తూ  తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ప్రకృతితో, దైవంతో, పుట్టిన గడ్డతో మమేకయ్యేలా ఈ వేడుకలను జరుపుకుంటారని ఆమె పేకొనియాడారు. 
 
ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు ఇచ్చుపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరమైనవని, బలవర్ధకమైనవని తెలిపారు. పండుగ సందర్భంగా వీటి పంపిణీ ద్వారా మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతుందని సూచించారు. 
 
బతుకమ్మ కోసం వాడే పూలలో ఔషధ గుణాలుంటాయని, వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. తాను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబురాలు గత సంవత్సరం నుంచి ప్రారంభించానని గుర్తు చేశారు.  
 
తెలంగాణ సోదరిగా ఒక ఆడబిడ్డగా తనకు ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె చెప్పారు. వచ్చే సంవత్సరం కోవిడ్ 19 పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తే బతుకమ్మను ఘనంగా జరుపుకుందామని ఆమె పేర్కొన్నారు.