వరదల సమయంలో జగన్ తీరుపై వీర్రాజు అసంతృప్తి 

తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా  భారీ వర్షాలు కురుస్తుండగా వరద నివారణ సమస్యలు, నష్టాలను అంచనా వేయడంలో వై ఎస్ జగన్  మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కనీసం తక్షణ పరిహారం కూడా ఇవ్వలేదని,  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రితో వరదలు గురించి మాట్లాడినా తగినంతగా స్పందించలేదని విచారం వ్యక్తం చేశారు.

ఈ భారీ వర్షాలపై ఇవాళ కేంద్ర వ్యవసాయ మంత్రి పురుషోత్తంతో సోము వీర్రాజు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలకు పంట నష్టాన్ని కేంద్రానికి‌ వివరించారు.

నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే బృందాలను పంపాలని తాము కేంద్ర మంత్రితో మాట్లాడామని తెలిపారు.

భారీ వర్షాలతో కృష్ణ, గోదావరి నదులతో పాటు, అనేక ఉపనదులు, ప్రవాహాలు, కాలువలు, చెరువులు పొంగి గ్రామాలను నిండిపోయాయి. పొలంలో వరి, పత్తి, మిల్లెట్, వేరుశనగ, అరటి, ఉల్లిపాయ వంటి ఉద్యాన పంటలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయని వీర్రాజు తెలిపారు. 

బీజేపీకి చెందిన నాలుగు బృందాలు వరద పీడిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశాయని చెప్పారు. జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాష్ట్రంలో వరద పరిస్థితులు, రైతులకు జరిగిన నష్టాన్ని వివరించారు. 

రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయం, సహకారం అందించాలని కోరుతున్నాని చెబుతూ నివేదికలను ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపామని చెప్పారు. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు వీర్రాజు వెల్లడించారు.