
బీహార్ నిజంగా `ఆత్మ నిర్భర్’ కావాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే గెలుపు అనివార్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సంసారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలసి ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఇక్కడ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు పట్ల విశ్వాసం కనిపిస్తున్నదని చెప్పారు.
ప్రతి సర్వే కూడా బీహార్ లో తిరిగి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లు చెబుతూ ఉండడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ అభివృద్ధి కోసమే తాము నితీష్ కుమార్ తో చేతులు కలిపినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు బీహార్‌ను పాలించిన వాళ్లు, ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రంపై కన్నేసినట్లు ప్రధాని ధ్వజమెత్తారు. బీహార్‌ను వెనక్కి నెట్టిన వారిని ఎవరూ మరిచిపోవద్దని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆ రోజుల్లో శాంతి భద్రతలు లేవని, అవినీతి రాజ్యమేలిందని మోదీ విమర్శించారు. తమ ప్రభుత్వం కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని, అయితే అధికారంలోకి వస్తే మళ్లీ ఆ ఆర్టికల్‌ను తెస్తామని విపక్షాలు అంటున్నాయని అంటూ అలాంటి పార్టీలు బీహార్‌లో ఎలా ఓట్లు అడుగుతున్నాయని విస్మయం వ్యక్తం చేశారు.
ఇది బీహారీలకు అవమానం కాదా అని ప్రధాని ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి వెళ్తున్న బీహారీలను ఇది వంచించినట్లు కాదా అని మోదీ నిలదీశారు. పుల్వామా ఉగ్రదాడిలో బిహారీ సైనికులు నెలకొరిగారని, గాల్వాన్ లోయలో భారత పతాకాన్ని నిలిపి ఉంచడం కోసం అమరవీరులయ్యారని ప్రధాని గుర్తు చేశారు.
బీహార్ ఇప్పుడు వేగంగా వికాశం దిశగా వెళ్తోందని చెబుతూ గతంలో కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం బీహార్ అభివృద్ధికి సీఎం నితీశ్ కుమార్‌కు ఎటువంటి సాయం చేయలేదని గుర్తు చేశారు.
కరోనాను ధైర్యంగా ఎదిరించిన బీహార్ ప్రజలను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కలసి తీసుకున్న చర్యల కారణంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగారని చెప్పారు.
‘‘నితీశ్ సర్కార్ త్వరగా స్పందిచకపోతే… మహమ్మారి చాలా మందిని పొట్టనబెట్టుకునేది. ఊహించడానికే వీలుండేది కాదు. అల్లకల్లోలంగా ఉండేది. కరోనాతో పోరాడాం. ఈ రోజు బిహార్‌లో ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాం.’’ అని మోదీ తెలిపారు.
రాష్ట్రాన్ని గతంలో రోగాల పాలు చేసిన వారిని మళ్లీ దగ్గరకు రానివ్వవద్దు అని బీహారీ ఓటర్లు కంకణం తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. గతంలో పేదల కోసం ఉద్దేశించిన డబ్బుతో అవినీతి పనులు చేశారని, కానీ తాము మాత్రం ఆ డబ్బుతో కరోనా సమయంలో పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని అందించామని ఆయన గుర్తు చేశారు.
మార్కెట్ యార్డులు, కనీస మద్దతు ధర అని ప్రతిపక్షాలు ఓ సాకుగా వాడుతున్నాయని, వారి అసలు లక్ష్యం దళారులను రక్షించడమేనని ఆరోపించారు. రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేసే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపడితే… విపక్షాలు లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టించాయని ఆయన మండిపడ్డారు.
రాఫెల్ విమానాల కొనుగోలు సమయంలో కూడా విపక్షాలు ఇదే ప్రచారాన్ని చేశాయని, ఇప్పటికీ దళారుల భాషే మాట్లాడుతున్నారని మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఇటీవలే బీహార్ ఇద్దురు కుమారుల్ని కోల్పోయిందని చెబుతూ పేదలు, దళితుల పట్ల పోరాటం చేసిన రామ్‌విలాశ్ పాశ్వాన్ చివర వరకు తనతో ఉన్నట్లు చెప్పారు. పేదల కోసం బాబు రఘువంశ్ ప్రసాద్ సింగ్ కూడా పనిచేశారని కొనియాడారు. ఆ ఇద్దరికీ తాను నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీహార్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అంతకు ముందు నితీష్ కుమార్ చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే ప్రతి గ్రామంకు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, సాగునీటి వసతులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
More Stories
చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు