ఒడిశా సీఎం ఏరియల్ సర్వేపై దుమారం   

ఒడిశాలోని వరద ప్రాంతాలలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  ఆగష్టు 31న చేసాడని చెబుతున్న ఏరియల్ సర్వే ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది.  ఆరేడు వారల తర్వాత ఆర్టీఐ సమాధానాల ఆధారంగా ఓటివి  టివి ఛానల్ ఆ సర్వే కధనాన్ని ప్రశ్నిస్తూ అక్టోబర్ 14న ప్రసారం చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నది. 

ఈ సందర్భంగా తలెత్తిన ప్రశ్నలపై  ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఎందుకు మౌనంగా ఉన్నదని ఆర్టీఐ కార్యకరత ప్రదీప్ ప్రధాన్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. “నిజంగా ముఖ్యమంత్రి వరద బాధిత జిల్లాల్లో ప్రాంతాలలో ఏరియల్ సర్వే జరిపారా? అది నిజమే అయితే  ఆ సర్వేకి సంబంధించిన 19 నిముషాల వీడియో విషయమై సీఎంఓ ఎందుకు మౌనంగా ఉంటున్నది?” అంటూ  ప్రశ్నించారు.

ఏ ప్రాంతాలలో ఆ 19 నిముషాలలో ముఖ్యమంత్రి పర్యటించారు? ఆ సమయంలో పట్నాయక్ వెంట వెళ్లిన అధికారులు ఎవ్వరు? పైగా, ముఖ్యమంత్రి వృద్ధాప్యం దృష్ట్యా పర్యటనలో ఆయన వెంట వైద్య బృందం కూడా ఉంది ఉండవలసింది. అట్లాఅయితే సర్వే సమయంలో ఆయన వెంట వెళ్లిన వైద్యులు ఎవ్వరు? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

అదీగాక, సర్వేను కేవలం 19 నిముషాలలో ఏ విధంగా పూర్తి చేయగలిగారని అంటూ  అనుమానం వ్యక్తం అవుతున్నది.  ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా (ఎఎఐ) ఒక ప్రకటన చేస్తూ సీఎం హెలికాఫ్టర్ ఆకాశంలో 19 నిముషాలు ఉన్నట్లు తెలిపింది.

అయితే 19 నిముషాల వ్యవధిలో ముఖ్యమంత్రి సందర్శించిన ప్రాంతాల గురించి ఆర్టీఐ కార్ర్యకర్త శ్రీకాంత్ కుమార్ పాకాల ప్రశ్నలు లేవనెత్తారు.  19 నిముషాలలో ఎంత దూరం ప్రయాణం చేయవచ్చో, ఆ విమానం ఎంత వేగంగా వెళ్లిందో అన్న విషయాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

నిపుణుల కధనం మేరకు భుబనేశ్వర్ నుండి జైపూర్ మధ్య 45 నాటికల్  మైళ్ళ దూరం ఉంది. అంతే వెళ్లి, తిరిగి రావడానికి 90 నాటికల్  మైళ్ళ దూరం. ఒడిశా సీఎం ప్రయాణించిన వీటిఓఎస్ఎచ్ విమానం గరిష్టంగా 169 కిలోనాట్ల వేగంతో ప్రయాణించగలడు. 90 నాటికల్  మైళ్ళ దూరాన్ని 19 నిముషాలలో పూర్తి చేయాలంటే 270 కిలోనాట్ల వేగం అవసరం కాగలదు. 

“ముఖ్యమంత్రి ప్రయాణించిన విమానం 20 నిముషాలలో 40 నుండి 50 మైళ్ళ దూరం మాత్రమే వెళ్లగలదు. భుబనేశ్వర్ నుండి జైపూర్ ల మధ్య దూరం 40 నుండి 50 మైళ్ళు ఉండడంతో ఈ సర్వేని 19 నిముషాలలో పూర్తి చేయడం అసంభవం”అని పైలట్, కెప్టెన్ రాజ్ నారాయణ్ మహాపాత్ర చెప్పారు. 

“విమానం జైపూర్ కు వెళ్లి 19 నిముషాలలో తిరిగి రావడం చాలా ప్రమాదకరం. అంత హడావుడిగా ఒక విఐపి విమానం, సర్వే విమానం ప్రయాణం చేసింది? ఎందుకు హడావుడిగా విమాన ప్రయాణం చేశారో వివరణ ఇవ్వాలి” అని కెప్టెన్ మన్మథ రౌత్రాయ్ ప్రశ్నించారు. 

ఇలా ఉండగా,ఈ  కధనాన్ని ప్రసారం చేసిన మరుసటి రోజుననే ఓటివి లో సీనియర్ జర్నలిస్ట్ రమేష్ రథ్ ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ టివి ఛానల్ ను బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి బైజయంత్ పాండా నిర్వహిస్తున్నారు.

ఒక మహిళా ఎంపీకి సంబంధించిన `అస్లీల’ వీడియో క్లిప్ వ్యాప్తికి సంబంధించిన పాత కేసు విషయంలో రమేష్ రథ్ ను కియోంజార్ జిల్లాకు చెందిన పోలీస్ బృందం ప్రశ్నించినట్లు భుబనేశ్వర్ పోలీస్ కమీషనర్ సు సుధాన్షు సారంగి తెలిపారు.

అయితే తమ రిపోర్టర్ ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకు వెళ్లారని ఓటివి ఛానల్ ఆరోపించింది. తమ రిపోర్టర్ ను నవీన్ పట్నాయక్ కు చెందిన వార్తను ప్రసారం చేసినందుకు  “అరెస్ట్” చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీజాయంత్ పాండా ఆరోపించారు.

“సీఎం నవీన్ పట్నాయక్ చెబుతున్న వరద ప్రాంతాలలో ఏరియల్ సర్వే వార్తకు సంబంధించి ఆర్టీఐ  కార్యకర్త వెల్లడించిన అంశాలను ప్రసారం చేసినందుకు మా రిపోర్టర్ ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనను భారత్ ఎడిటర్ గిల్డ్ ఖండిస్తుందా? లేదా భారత దేశంలోని భావప్రకటన స్వేచ్ఛ కోరుతున్న యోధులు నిరసన వ్యక్తం చేస్తారా లేదా తమ అవార్డు లను తిరిగి ఇచ్చివేస్తారా?” అంటూ ట్వీట్ చేశారు. 

తర్వాత ఒక పోలీస్ బృందం తమ ఛానల్ కార్యాలయానికి వచ్చి సోదాలు జరుపుతామని చెప్పి, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నదని కూడా ఆయన చెప్పారు. 

“ఈ విధంగా మా కార్యాలయం సోదా జరపడానికి  సోదా వారెంట్ చూపవలసిందే అని మేము చెప్పాము. ముందు రోజు రాత్రి నుండే  మా కార్యాలయం ఎదుట పోలీసులను ఉంచారు. రథ్ ను నిర్బంధించి, తర్వాత అండర్ టేకింగ్ తీసుకొని వదిలివేశారు. అక్టోబర్ 21న కియోంజార్ పోలీస్ ల ముందు హాజరు కావాలని కూడా అతనికి చెప్పారు” అని ఇండియా టుడే టివితో ఆయన చెప్పారు. 

ఈ లోగా, భువనేశ్వర్ లోని జర్నలిస్ట్ నివాసం, ఓటివి కార్యాలయం నుండి పోలీసులు కొన్నీ పత్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉండగా, ఓటివి ఛానల్ కు అందుబాటులో గల ఒక ఆర్టీఐ సమాధానం ప్రకారం ఆ రోజున ఎటువంటి వివిఐపి విమాన ప్రయాణం జరగనే లేదు.

కేవలం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఒక విమానం ఆగష్టు 31న ఎగిరింది. ఆ విమానం విమానాశ్రయం నుండి ఎగిరి  19 నిముషాలలో తిరిగి వచ్చింది. అందులో ఎగిరిన సమయం తొమ్మిదిన్నర నిముషాలు మాత్రమే.

సీఎం ఏరియల్ సర్వే పై తలెత్తిన వివాదంపై బీజేపీ విస్మయం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేసింది. వార్త కధనాన్ని ప్రసారం చేసిన జర్నలిస్ట్ ను వేధించే బదులు మొత్తం విషయమై స్పష్టత ప్రభుత్వమే ఇవ్వాలని బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రిథ్వీరాజ్ హరిచందన్ స్పష్టం చేశారు.