పాక్ ఆక్రమిత కశ్మీర్‌ వెల్లువెత్తిన నిరసనలు    

సరిగ్గా 73 ఏండ్ల కిందట ఇదే రోజున జమ్ముకశ్మీర్ ఆక్రమణ కోసం ఆ రాజ్యంపై పాకిస్థాన్‌ దాడి చేసింది. దీంతో జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రజలు ప్రతి ఏటా అక్టోబర్‌ 22ను చీకటి రోజుగా పాటిస్తారు. ఇందులో భాగంగా గురువారం పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో నిరసనలు వెల్లువెత్తాయి. ముజఫరాబాద్, మీర్పూర్, రావాలాకోట్, కోట్లి, గిల్గిట్, రావల్పిండి నగరాల్లో ప్రజలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. 

కశ్మీర్‌పై దాడి సందర్భంగా వేలాది మంది కశ్మీరీ ప్రజలను పాక్‌ హతమార్చడంపై మండిపడ్డారు. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఆ దేశ సైన్యాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రజలపై పోలీసులు టీయర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. నిరసనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు.

1947 అక్టోబర్ 22న కశ్మీర్ రాజ్యంపై పాకిస్థాన్ దాడి చేసింది. ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో వేలాది మంది కశ్మీర్ ప్రజలను హతమార్చి కొంత భాగాన్ని ఆక్రమించింది. కశ్మీర్‌ రాజ్యాన్ని ఆక్రమించేందుకు పాకిస్థాన్‌ మేనేజర్‌ జనరల్ అక్బర్ ఖాన్ ఆదేశాలతో 1947 అక్టోబర్ 22న ఆ దేశ సైన్యం ఆపరేషన్ గుల్మార్గ్‌ పేరుతో దాడి చేసింది.

అక్టోబర్ 24న ముజఫరాబాద్, డోమెల్‌ను ఆక్రమించింది. 26న బారాముల్లా ప్రాంతాన్ని పాక్‌ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఈ ప్రాంతంలోని 14 వేల మంది ప్రజల్లో కేవలం మూడు వేల మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. అనంతరం శ్రీనగర్‌కు 35 కిలోమీటర్ల దూరానికి పాక్‌ సైన్యం చేరుకున్నది. దీంతో కశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ భారత్‌ సహాయం కోరారు. తన రాజ్యాన్ని భారత్‌లో కలిపేందుకు సమ్మతి తెలిపే పత్రాలను అక్టోబర్ 26న ఢిల్లీకి పంపారు.

దీంతో అక్టోబర్ 27న భారత్‌ సైన్యాన్ని కశ్మీర్‌కు పంపింది. పాక్‌ సైన్యం శ్రీనగర్‌కు చేరకుండా భారత సైన్యం నిలువరించింది. ఈ ఘటన అనంతరం జమ్ముకశ్మీర్‌ రాజ్యం రెండు ముక్కలైంది. పాకిస్థాన్‌ స్వాధీనంలోని ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)గా, భారత్ ఆధీనంలోని ప్రాంతాన్ని భారత జమ్ముకశ్మీర్‌గా వ్యవహరిస్తున్నారు.

 కాగా నాడు పాక్‌ దాడి సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన హిందువులు, సిక్కులు భారత్‌కు వలస వచ్చారు. జమ్ముకశ్మీర్ రాజ్యాన్ని భౌగోళికంగా విడదీసి ఆ ప్రాంత సంస్కృతిని ధ్వంసం చేసిన పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌ ప్రజలు, శరణార్థులు ప్రతి ఏటా అక్టోబర్ 22ను బ్లాక్ డేగా పాటిస్తున్నారు.