ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను ఆ సంస్థ నిలిపివేసింది. డేటా చోరీ యత్నాన్ని గుర్తించినట్లు ఆ కంపెనీ గురువారం తెలిపింది. అసవరమైన నివారణ చర్యల కోసం అన్ని డేటా సెంటర్లను వేరు చేసినట్లు పేర్కొంది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సీఐఓ ముఖేష్ రతి ఈ విషయాన్ని ధృవీకరించారు. అన్ని సేవలు 24 గంటల్లోపు తిరిగి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ సైబర్ దాడి తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు.
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్న తరుణంలో ఔషధ తయారీ సంస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటా చోరీ కోసం ప్రయత్నిస్తున్నారు. స్పుత్నిక్ వి పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను రష్యా గత నెలలో అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది.
అయితే రష్యా టీకా సామర్థ్యంపై తొలుత అనుమానాలు వ్యక్తం కావడంతో డ్రగ్స్ నియంత్రణ సంస్థ దీనికి అనుమతి నిరాకరించింది. సంబంధిత సమాచారం అందిన నేపథ్యంలో స్పుత్నిక్ వి 2,3 దశల ట్రయల్స్ కోసం డాక్టర్ రెడ్డీస్‌కు ఇటీవల అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఐటీ నెట్‌వర్క్ వ్యవస్థపై సైబర్ దాడి జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది. దీంతో భారత్‌తోపాటు రష్యా, అమెరికా, బ్రెజిల్, బ్రిటన్‌లోని ఆ కంపెనీ ప్లాంట్స్‌పై ప్రభావం పడినట్లు తెలుస్తున్నది. డేటా చోరీపై ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు జరుపుతున్నది.
ఇంటిగ్రేటెడ్ ఔషధ తయారీ సంస్థ అయిన డాక్టర్ రెడ్డీస్ తన మార్కెట్ కార్యకలాపాలను భారత్, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మరోవైపు సైబర్ దాడి కారణంగా డాక్టర్ రెడ్డీస్ షేర్లు గురువారం 3 శాతం మేర పతనమయ్యాయి.
More Stories
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా