బెంగాల్ సంస్కృతికి  నవరాత్రులు ప్రతిబింబం 

బెంగాల్ సంస్కృతికి  నవరాత్రులు ప్రతిబింబం 

శరన్నవ రాత్రులు దేశ ఐకమత్యాన్ని, బలాన్ని చూపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెంగాల్ నుంచి వచ్చిన సంస్కృతి, సంప్రదాయాలకు ఈ నవరాత్రులు ప్రతిబింబమని తెలిపారు. 

శరన్నవరాత్రుల సందర్భంగా బెంగాల్ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ‘వర్చువల్ ప్రసంగం’ చేస్తూ ఈ సంవత్సరం దుర్గా పూజలను కోవిడ్ మధ్య జరుపుకుంటున్నామని, భక్తులందరూ ఆదర్శప్రాయమైన నిగ్రహాన్ని చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉంటే ఉండవచ్చు కానీ…. భక్తిలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్ మధ్య దుర్గ పూజలను జరుపుకుంటున్నా వ్యక్తుల ఆనందంలో, ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదని, ఇదీ  నిజమైన బెంగాల్ అని మోదీ ప్రశంసించారు. కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరూ రెండు గజాల దూరం పాటిస్తూ, మాస్క్ కచ్చితంగా ధరించి పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

ఈ సందర్భంగా బెంగాల్ గడ్డలో పుట్టిన మహానుభావులందరికీ మోదీ నివాళులర్పించారు. ‘‘బెంగాల్‌లో ఉన్నట్లే నాకు అనిపిస్తోంది. ఈ పూజ మీతో జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత దేశ చరిత్రలో అవసరం వచ్చినప్పుడల్లా బెంగాల్ అందుకు ఓ మార్గాన్ని చూపింది” అంటూ కొనియాడారు. 

“ఈ గడ్డ నుంచి చాలా మంది మహానుభావులే ఉద్భవించారు. దేశానికి సరైన మార్గదర్శకత్వం అవసరమైనప్పుడల్లా బెంగాల్ గడ్డ సహకారం అందించింది. దేశాన్ని బెంగాల్ లోని మహానుభావులు సరైన దిశలో నడిపించారు. వారి పేర్లను చెబుతూ పోతే… రోజంతా గడుస్తుంది కానీ… పేర్లు మాత్రం ముగియవు. భారత దేశం గర్వించేలా బెంగాల్ ప్రజలు మసులుకున్నారు” అంటూ గుర్తు తెచ్చుకున్నారు. 

ఆత్మ నిర్భర భారత్’ లో బెంగాల్ పాత్ర పుష్కలంగా ఉందని మోదీ కొనియాడారు. గురుదేవులు ర‌వీంద్ర‌నాథ్ టాగోర్‌, బంకిమ్ చంద్ర ఛ‌ట‌ర్జీలు ఆత్మ‌నిర్బ‌ర్ సందేశం వినిపించారని చెబుతూ ఆత్మనిర్భర భారత్ అన్న నినాదాన్ని తీసుకొని దేశం ముందుకెళ్తోందని, దీని కిందనే బెంగాల్‌లో అభివృద్ది జరుగుతోందని తెలిపారు.

బెంగాల్ అభివృద్ధి కోసం శ‌ర‌వేగంగా తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు. ‘పీఎం ఆవాస్ యోజన’ కింద 30 లక్షల ఇళ్లు నిర్మించామని, ఉజ్వల యోజన పథకం కింద 90 లక్షల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. వీటితో పాటు నాలుగు లక్షల మంది బ్యాంక్ అకౌంట్లను తెరిచారని, మెట్రో ప్రాజెక్టును కూడా వేగవంతం చేసినట్లు మోదీ వివరించారు.