బిడెన్ కు రష్యా నుంచి మిలియన్  డాలర్లు  

రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌- డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ల మధ్య గురువారం చివరి ముఖాముఖి చర్చ జరిగింది. ఈ సందర్భంగా  రష్యా, చైనాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

 రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతోందని ఆరోపించారు.  2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అనూహ్య విజయం వెనుక రష్యా ప్రమేయం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని రష్యా గూఢచారి సంస్థ పేర్కొంది. 

తాజాగా. అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటూనే ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి. 

మరోవంక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఏ దేశమైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని బిడెన్ హెచ్చరించారు.  ‘అమెరికా ఎన్నికల విషయంలో కలుగజేసుకునే ఏ దేశమైనా కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని నేను స్పష్టంగా చెబుతున్నాను’ అని  జో బిడెన్ ప్రపంచ దేశాలకు  హెచ్చరికలు పంపారు.

మరోవంక, కరోనా విషయమై కూడా ఇద్దరు ప్రత్యర్థుల మధ్య వాదోపవాదాలు కొనసాగాయి. కరోనాకు కారణం చైనానే అని స్పష్టం చేస్తూ అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో అమెరికా ముందంజలో ఉందని వెల్లడించారు.

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెబుతూ అయినా కొన్ని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని వారాలలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని వెల్లడిస్తూ ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని ట్రంప్ తన ముఖాముఖి చర్చలో తెలిపారు. త్వరలోనే విద్యాసంస్థలు తెరుచుకుంటాయని చెప్పారు. 

అయితే,  కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనాను కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, చైనాకు రాకపోకలు నిషేధించడంపై ట్రంప్ ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. కరోనా మరణాలకు కారణమైన వారు అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని బిడెన్ ధ్వజమెత్తారు.