5 ఏపీ జిల్లాల్లో ప్రమాదకరంగా కరోనా

కరోనావైరస్ దేశం మొత్తాన్ని వణికిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తగ్గినా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 30 అత్యంత కరోనా ప్రభావిత జిల్లాలను ప్రకటించింది. 
 
ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు నెలల కాలం తర్వాత దేశంలో తొలిసారి మంగళవారం 50 వేల కంటే తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 67 శాతం కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో టాప్‌-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్నట్ల పేర్కొంది. 
 
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీకి చెందిన 5 జిల్లాలు కూడా ఉన్నాయి. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా విజృంభణ అధికంగా ఉందని కేంద్రం తాజా గణాంకాల్లో వెల్లడించింది. 
 
కాగా, ఏపీలో మునుపటితో పోలిస్తే కరోనా విజృంభణ చాలావరకూ తగ్గినప్పటికీ.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మరోవైపు మరణాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గింది.