
తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో బహిరంగ చర్చకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. ఆర్థికమంత్ రి హరీశ్‌రావుకు దమ్ముంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బండి సంజయ్‌తో చర్చకు ఒప్పించాలని ఆమె సవాల్ చేశారు.
రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులపై ఆర్థికమంత్రి హరీష్ రావుకి స్పష్టత లేకపోవటం సిగ్గుచేటని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక స్ట్రీట్ లైట్ పెట్టాలన్నా కేంద్ర నిధులతోనే అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రంలోని బీజేపీ
ప్రభుత్వమే చేస్తున్నదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ విమర్శించడాన్ని ఆమె తప్పు బట్టారు. బీజేపీ అసత్య ప్రచారాలను నిరూపించడానికి దుబ్బాక బస్టాండ్ సెంటర్‌కు రావడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరిన హరీష్ కు ఆమె ప్రతి సవాల్ విసిరారు.
కాగా, దుబ్బాక ఉపఎన్నికలలో ఓటమి భయంతోనే మంత్రి హరీష్ రావు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ కు మింగుడు పడటంలేదని ఆమె చెప్పారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ దుబ్బాకలో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించి హరీష్ రావే టికెట్ ఇప్పించాడని ఆమె ఆరోపించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో హరీష్ రావు చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.
అభివృద్ధిలో సిద్ధిపేట, గజ్వేల్ కు, దుబ్బాకకు సంబంధం లేదని ఆమె గుర్తు చేశారు. గజ్వేల్ , సిద్ధిపేట, సిరిసిల్ల మీ కుటుంబ చేతిలో ఉంటే దుబ్బాక గెలవాలని ఎక్కడైన రాసి ఉందా? అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారం, డబ్బు బలంతో గెలవాలని చూస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
దుబ్బాకలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని అరుణ హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ మాట తప్పారని, టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆమె పేర్కొన్నారు.
More Stories
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు
కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ సొరంగం బహిర్గతం
తెలంగాణ సీఎస్‌గా కే రామకృష్ణారావు