రేపు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర బృందం

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి  కేసీఆర్ లేఖ రాశారు.

ఈ క్రమంలో కేంద్ర బృందం రేపు(గురువారం) సాయంత్రం హైద‌రాబాద్‌కు రానుంది. వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు న‌గ‌రానికి కేంద్రం బృందం వచ్చి రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచ‌నా వేయ‌నుంది.

ఇప్ప‌టికే న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ సాయం కింద  సీఎం కేసీఆర్ రూ. 550 కోట్ల సాయం ప్ర‌క‌టించారు. వ‌ర‌ద బాధితుల  కుటంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. 

ఇక ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్లు, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం రూ. 2 కోట్లు, మై హోం సంస్థ రూ. 5 కోట్లు, చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ. కోటి చొప్పున ప్ర‌భుత్వానికి విరాళం అందించారు.

ఇలా  ఉండగా,గత వారం రోజులుగా వర్షాలు, వరదలు కారణంగా అష్టకష్టాలు పడ్డ హైదరాబాద్‌ ప్రజలకు రేపటి నుంచి ఊరట కలగనుంది. రేపటి నుంచి హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైందని, ఇది రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఓ మాదిరి వర్షాలు మాత్రమే పడతాయని, హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. హైదరాబాద్‌ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందొద్దని పేర్కొంది.