ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టు కు నిమ్మగడ్డ 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడంలేదని ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. 

ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, ఎన్నికల నిర్వహణకు ఖర్చు అయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేసిందని రమేష్‌కుమార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకొని వెంటనే నిధులు విడుదల అయ్యేలా చూడాలని కోరారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 (కె) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిదులు ఆపేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీలను చేర్చారు. 

రమేష్‌కుమార్‌ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆర్డర్‌ అవసరంలేదని స్పష్టం చేసింది.

దీనిపై ప్రభుత్వ తరుఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ సహకరించాలని కోరారు. దీంతో హైకోర్లు కలగజేసుకుని ప్రతిదానికీ రాజ్యాంగ సంస్థ వచ్చి ప్రభుత్వాన్ని అడగాలా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం ఏ విషయాల్లో సహకరించడం లేదో తెలపాలని ఎస్‌ఇసికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.