జగన్ ఇంద్రకీలాద్రి పర్యటన సమయంలో అపశృతి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలలో  5 వ రోజైన ఈ బుధ‌వారం దుర్గమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడడంతో కలకలం రేగింది. 

విరిగిన కొండ చరియలు ఓ షెడ్డుపై పడటంతో అది కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరగడంతో ప్రస్తుతం అమ్మవారి దర్శనాలు అపేశారు.

భారీ వర్షాల వలన రెండు మూడు రోజులుగా కొండ‌పై నుంచి చిన్న చిన్న రాళ్లు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారు.  

ఈ బుధ‌వారం ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి  అమ్మ‌వారిని ద‌ర్శించుకోకున్న నేపధ్యంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనతో అధికారులలో ఆందోళన నెలకొంది. దర్శనం కోసం వెళ్ళే భక్తుల కోసం వేసిన టెంట్ లు అన్నీ ఈ కొండ చరియల వలన ద్వంసం అయ్యాయి.

కొండ సగానికి సగం బీటలు వేసింది. ప్రమాదానికి ఆస్కారముందని చెబితే  దసరా తర్వాత చూస్తామని అధికారులు  నిర్లక్ష్యంగా బదులిచ్చారు.   పలువురు మృతి చెంది ఉండవచ్చని చెబుతున్నారు.

 అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులపై అవి పడటంతో వారు గాయాల పాలయ్యారు. కొండచరియలు విరిగి పడిన సమయంలో ఆలయ సిబ్బంది కూడా కొందరు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు తక్షణ సాయం అందించారు. ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టారు.

 కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే  అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు పడుతాయని, మరికొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

పది రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికి మూడుసార్లు భారీ వర్షాలు పడ్డాయి. వరదలకు రైతులు అతలాకుతలమవుతున్నారు. ముంపులు, మునకలతో లోతట్టు ప్రాంతాల వారు నీళ్లతోనే సహవాసం చేస్తున్నారు.