యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోకపోతే హిందూ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 
 
హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. రాష్ట్రంలో  1.8 శాతం ఉన్న క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతపై విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధానిని కోరానని ఆయన వెల్లడించారు. 
 
‘కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్’ అంటూ మన చదువుకుంటున్న సుప్రభాతం ప్రభుత్వ చర్యలును అరికట్టక పోతే… ‘యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అని పాడుకోవల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు.   
 
కాగా, బీసీల్లో కులానికో సొసైటీ పెట్టి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ రాజు ఆరోపించారు.  విభజించి, పాలించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రధానికి లేఖ రాశానని తెలిపారు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌లో.. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తూ ఏపీలో రాజ్యాంగాన్ని చులకనగా భావించే ప్రభుత్వం తెలుగు భాషను కేంద్ర విద్యా విధానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లాంధ్రప్రదేశ్‌గా మార్చాలను చూస్తున్నారని ఆరోపించారు.