కమల్‌నాథ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఎన్నికల ప్రధాన కమీషనర్ కు  లేఖ వ్రాసింది.  

తాను ఓ జాబితా నుంచి పేర్లు చదువుతుండగా ‘‘ఐటమ్’’ అని అన్నట్లు కమల్‌నాథ్ చెప్తున్నారని, ఆ జాబితాలో ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని  ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ    డిమాండ్ చేశారు. ఆయన ఎన్నో ‘‘ఐటమ్’’ అని అడిగిన వ్యాఖ్యలు అవమానకరమని ఆమె స్పష్టం చేశారు.

ఆయన వ్యాఖ్యలు ఆయన నడవడికను వెల్లడిస్తున్నాయని అంటూ క్షమాపణ చెప్పడానికి బదులుగా, పనికిమాలిన వివరణ ఇస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ  ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. 

ఎన్‌సీడబ్ల్యూ అంతకుముందు సీఈసీకి వ్రాసిన లేఖలో మధ్యప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇమారతీ దేవిపై కమల్‌నాథ్ అవమానకర వ్యాఖ్యలు చేశారని తెలిపింది. దీనిపై సీఈసీ స్పందిస్తూ, సవివరమైన నివేదికను సమర్పించాలని మధ్య ప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ)ను ఆదేశించింది. 

ఇలా ఉండగా, కమల్‌నాథ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. కమల్‌నాథ్ తన పార్టీ నేత అని, అయితే వ్యక్తిగతంగా తాను ఆయన ఉపయోగించిన భాషను ఇష్టపడనని స్పష్టం చేశారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. 

 మరోవంక,అవమానకరంగా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు.  అన్నివైపులా నుండి విమర్శలు ఎదురు కావడంతో ఎట్టకేలకు ‌ మంత్రి ఇమార్తీదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కమల్‌నాథ్‌ విచారం వ్యక్తం చేశారు.