చేసిన పనితీరును బట్టి ఎన్నుకోండి 

చేసిన పనితీరును బట్టి ఎన్నుకోండి 
‘భవిష్యత్తులో ఏం చేస్తారనే దాని ఆధారంగా నేతలనో, పార్టీలనో ఎన్నుకోవద్దు. గతంలో ఏం చేశారన్న దానిపై ఎన్నుకోండి. ఆ పార్టీ గతంలో చాలా మంచి పనులు చేసి ఉండే భవిష్యత్తులో కూడా అదే చేస్తుంది’ అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా బీహార్ ఓటర్లకు పిలుపిచ్చారు.

బక్సర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, 2014కు ముందు ఎన్నికల ప్రసంగాలన్నీ కులాలు, ప్రాంతాలు, ఆరోపణల పరంగానే సాగేవని గుర్తు చేశారు.

అభివృద్ధి పనుల ప్రస్తావన ఏ ప్రసంగాల్లోనైనా ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా భారత రాజకీయాల సంస్కృతిని మార్చివేశారని చెప్పారు.

మోదీ వర్క్ రిపోర్ట్ కార్డును మిళితం చేశారని చెబుతూ ఇవాళ ఎవరు ప్రజల ముందుకు వచ్చినా తాము చేసిన పనుల (వర్క్ రిపోర్ట్)తోనే వస్తున్నారని, తాము చేసిన పనులు వివరించి ఓట్లు అడిగేలా భారత రాజకీయాల్లో మార్పును మోదీ తీసుకువచ్చారని నడ్డా కొనియాడారు.

‘ఇప్పుడు ఆర్జేడీ పోస్టర్లు కొన్ని చూశాను. అందులో తేజస్వి ఉన్నారు కానీ లాలూ లేరు. ఇప్పుడు లూటీల పాలనకు తావులేదని బిహార్ ప్రజలకు బాగా తెలుసుకుండటమే ఇందుకు కారణం’ అంటూ ప్రతిపక్ష కూటమిని ఎద్దేవా చేశారు.

1లాంతర్ పాలనకు బదులుగా మోదీ ఎల్‌ఈడీ రూల్ పాలన కావాలి. గూండారాజ్ పాలనకు బదులుగా చట్టబద్ధమైన పాలన ఉండాలి. అభివృద్ధి పాలన సాగాలి. ఈ తరహా మార్పు రావాలి’ అని నడ్డా స్పష్టం చేశారు.

కేంద్రం, బీహార్ ప్రభుత్వం కలిసి చేపట్టిన అభివృద్ధి పనులు మరింత పుంజుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మరోసారి ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.