లాక్‌డౌన్ సమయంలో పోలీసుల సేవలు అద్భుతం 

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైందని, చాలా అద్భుతంగా సేవలందించారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తూ 343 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు.  

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ‘పోలీసుల స్మారకా’నికి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ  దేశ భద్రత కోసం పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. వారి త్యాగం  వల్లే నేడు దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని కొనియాడారు. 

దేశం మొత్తం పండుగలు చేసుకుంటూ ఆనందంగా ఉంటే.. పోలీసులు మాత్రం తమ విధులను నిర్వర్తిస్తుంటారని ప్రశంసించారు. ఈ సంవత్సరం 260 మంది పోలీసులు అమరులయ్యారని చెబుతూ  ఈ స్మారక చిహ్నం ద్వారా పోలీసుల త్యాగం గురించి కొత్త తరం తెలుసుకుంటుందని పేర్కొన్నారు.

పోలీసుల ముందు నిరంతరం కొత్త కొత్త సవాళ్లు వస్తున్నాయని, ఆ సవాళ్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదం, నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మహిళలపై నేరాలు… ఇలా అనేక సవాళ్లను పోలీసులు ఎదుర్కొంటున్నారని వివరించారు. 

వీటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి మరింత ఆధునికమైన సాంకేతికతను అందిస్తామని ఆయన ప్రకటించారు. పోలీసులు దేశ రక్షణను చూసుకోవాలని, వారి కుటుంబాల యోగక్షేమాలను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని షా భరోసా కల్పించారు.