ట్రిపుల్ తలాక్ యోధురాలోకి బిజెపి మంత్రి హోదా 

ట్రిపుల్ తలాక్ యోధురాలోకి బిజెపి మంత్రి హోదా 

ట్రిపుల్ తలాక్ రద్దు కోసం వీరోచితంగా పోరాడిన షాయరా బానో ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె అధికార పార్టీ బీజేపీలో చేరిన 10 రోజుల్లోనే ఈ పదవిని పొందారు. 

ఇది సహాయ మంత్రి హోదాగల పదవి. ట్రిపుల్ తలాక్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినవారిలో ప్రధాన పిటిషనర్ షాయరా బానో.

షాయరా బానో, జ్యోతి షా, పుష్ప పాశ్వాన్‌‌లను ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. 

ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ, మహిళల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పెండింగ్ వివాదాలన్నీ వేగంగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఉత్తరాఖండ్‌లోని ఉద్ధం సింగ్ నగర్ జిల్లాకు చెందిన షాయరా బానోకు ఆమె భర్త స్పీడ్ పోస్ట్ ద్వారా విడాకులు ఇచ్చారు. నాలుగు నెలల తర్వాత, అంటే 2014లో, ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా  ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 

వెంట వెంటనే ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లో తీర్పు చెప్పింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం, 2019ని అమల్లోకి తీసుకొచ్చింది.