ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం టిటిడి బంగారం!

ఆర్ధిక వ్యవహారాలు దివాళా స్థితిలో ఉండడంతో అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఏవీ ముందుకు  రాకపోవడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా తిరుమల శ్రీవారి నగలను బ్యాంకులలో పెట్టి అప్పులో తీసుకోవడం ప్రారంభించడం విస్మయం కలిగిస్తున్నది. 

పేరుకు బంగారాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేస్తున్నట్లు చెబుతున్నా ఆచరణలో తాకట్టు పెట్టిన్నట్లే అవుతుంది. ఆ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే వరకు ఆ బంగారాన్ని తీసుకొవడం వీలుకాదు. టిటిడికి చెందిన సుమారు 1500 కిలోల బంగారం ఎస్‌బీఐ బులియన్‌ బ్రాంచ్‌కు డిపాజిట్‌ రూపంలో చేర్చడంతో ఈ ప్రక్రియకు నాంది పలికారు. 

మొన్నటికి మొన్న టిటిడి నిధులను రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలలో, బాండ్లలో పెట్టాలని తీర్మానించిన టిటిడి పాలకవర్గం ఇప్పుడు బంగారంపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి బాబాయి కావడంతో ఆచరణలో టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాగా మార్చివేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. 

శ్రీవారికి భక్తులు నగదుతోపాటు బంగారు నగలనూ కానుకగా సమర్పిస్తుంటారు. ఆ బంగారాన్ని 99.9 స్వచ్ఛమైన బిస్కెట్లుగా మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తుంటారు. దీనిపై బ్యాంకులు వడ్డీ రూపంలో బంగారాన్ని తిరిగి చెల్లిస్తాయి. ఇలా తిరుపతిలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ)లో టీటీడీ బంగారం డిపాజిట్‌ చేసింది. 

ఇందులో ఈ ఏడాది జూన్‌ 17న 409 కేజీలు, జూన్‌ 19వ తేదీన 1118 కేజీల బంగారం డిపాజిట్‌  మెచ్యూరిటీ పొందింది. అంటే మొత్తం 1527 కిలోల బంగారం! కాలావధి ముగిసిన బంగారాన్ని ముంబైలోని ఎస్‌బీఐ బులియన్‌ బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేయాలని టీటీడీ ‘ముందుగానే’ నిర్ణయించుకుని ఇండియన్‌ ఓవర్సీ్‌సబ్యాంకుకు ఆ సమాచారం పంపింది. 

అయితే. కరోనా లాక్‌డౌన్‌తో బంగారం దిగుమతులు ఆగిపోయాయని, డిపాజిట్లను మరో ఆరునెలలు పొడిగించాలని ఐవోబీ కోరింది. ఈ 6 నెలల కాలానికి కూడా 1.25 శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. అయితే, తాము 12 ఏళ్ల దీర్ఘకాలిక డిపాజిట్‌ చేస్తే, ఎస్బీఐ 2.5 శాతం వడ్డీ చెల్లిస్తోందని, ఆరునెలలకు కూడా అదే వడ్డీ ఇవ్వాలని టీటీడీ కోరింది. 

అందుకు కూడా ఐవోబీ అంగీకరించింది. జూన్‌ 19వ తేదీ నాటికి మెచ్యూరిటీ పొందిన బంగారంలో 575 కేజీల బంగారాన్ని అనుకున్న సమయానికే ముంబైలోని ఎస్‌బీఐ బులియన్‌ బ్రాంచ్‌కు చేరవేస్తామని, మిగిలిన 543 కేజీల బంగారాన్ని ఆరు నెలల్లోగా అందజేస్తామని, ఆలస్యం అయిన కాలానికి 2.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామని ఐఓబీ చెప్పింది. 

ఆరునెలలు కూడా ఆగకుండానే జూన్‌ 24వ తేదీకే మొత్తం బంగారం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. ఒక్కరోజు ఆలస్యానికి జరిగిన చెల్లింపులపైనా వడ్డీని లెక్కించి ఇచ్చేసింది. అయితే ఒక రోజుకు కూడా 2.5 శాతం వడ్డీ చెల్లించిన ఐఓబీ 12 ఏళ్లకు అంటే ఎస్బిఐ తో పాటు వడ్డీ చెల్లించి ఉండెడిది. ప్రత్యేకంగా ఆ బ్యాంకుకు మార్చడం వెనుక జగన్ ప్రభుత్వంపు ఆర్ధిక అవసరాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

గతంలోనూ వెంకన్న బంగారాన్ని సర్కారు అప్పులకోసం పరోక్షంగా వాడుకోవాలనే ప్రయత్నం జరిగినా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దానికి అడ్డుపుల్ల వేశారని తెలుస్తున్నది. ఉన్నబ్యాంకు నుంచి తీసి ఎస్‌బీఐలో ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఈసారి, టీటీడీ బోర్డు అదే తీర్మానాన్ని ఆమోదించేసి ఎస్‌బీఐకి పట్టం కట్టడం విశేషం.

పైగా, కేవలం అప్పుల కోసమే సృష్టించిన ‘ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌’కు ‘ఎస్‌బీఐ క్యాప్‌’ను కన్సల్టెంట్‌గా నియమించారు. దీనికి ఫీజుకింద సుమారు రూ.40 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. పైగా,  ఆదాయం లేని ఆ కార్పొరేషన్‌ను చూపి తేవాలనుకుంటున్న రూ.25,000 కోట్ల రుణానికి ప్రాసెసింగ్‌ ఫీజు కింద ఇంకో రూ.25 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. 

ఇలా ఉండగా, టీటీడీ నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్ల కొనుగోలును వ్యతిరేకిస్తూ బిజెపి నేత, టిటిడి పాలకవర్గ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి  హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.  అధిక వడ్డీ పేరుతో బాండ్ల కొనుగోలు నిర్ణయం సరికాదని స్పష్టం చేశారు. టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయని విమర్శిస్తూ, బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని నిలిపివేయాలని పిల్లో పేర్కొన్నారు.

బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన టీటీడీ నిధులు దాదాపు ఐదు వేల కోట్లు డిసెంబర్‌ నెలలో కాలపరిమితి తీరనున్నాయని, వాటని దారిని మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భానుప్రకాశ్ ఆరోపించారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, కార్యనిర్వాహణాధికారిని ప్రతివాదులుగా చేర్చాలని వ్యాజ్యంలోకోరారు.