బిసిలను విభజించి పాలిస్తున్న జగన్ 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల  కులాల కార్పోరేషన్ల నియామకం బిసిల కులాల మధ్య అనైక్యతను పెంచి విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి ధుర్మార్గమైన సూత్రంలాగా ఉందని బీజేపీ రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షుడు బిట్రా వెంకట శివన్నారాయణ ధ్వజమెత్తారు.

ఈ రాష్ట్రం లో 145 వెనుకబడిన కులాలు ఉండగా, అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వాగ్దానం ఇచ్చి ఇప్పుడు కేవలం 56 కులాలకు కార్పొరేషన్ లు ప్రకటించారని విస్మయం వ్యక్తం చేశారు.

పైగా, వాటిల్లో షేక్ కార్పొరేషన్, ముస్లిం సంచారజాతుల కార్పోరేషన్ లను బిసి జాబితాలో కలిపి బిసిలకు ఏం సందేశం పంపాలనుకుంటున్నారని సీఎం జగన్ ను నిలదీశారు.

ఇది బిసిల హక్కులకు భంగం కలిగించడమే  అని స్పష్టం చేస్తూ  దీనిని బిసిల ఆత్మగౌరవం, ఐక్యతను దెబ్బతీసే ప్రక్రియగా ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన ఓబిసి కార్పోరేషన్ ఉండగా ఈ కుల  కార్పొరేషన్ల నాటకం దేనికి అని ప్రశ్నించారు.

చట్టబద్ధత ఉన్న కార్పొరేషన్ పేరిట నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఆ నిధులు బిసిలకే వాడాల్సి వస్తుందనే భయంతో ఈ కార్పోరేషన్ల నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

అదే కులాల పేరిట కార్పోరేషన్లకైతే ఎంత నిధులు విడుదల చేశారు అలాగే ఎంత వినియోగించారనే జవాబుధారి వ్యవస్థ ఉండదని, అందుకే ఈ కుల కార్పొరేషన్ అనే విషబీజం నాటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చర్యలు రాబోయే రోజుల్లో బిసి జాతిని నిర్వీర్యం చేసి బిసిలను ఆర్థికంగా, సామాజికంగా అణగద్రొక్కి రాజ్యాధికారం అనే ఆలోచనలు బిసిలకు రాకుండా చేయాలనే ఈ భారీకుట్రను ఈ ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చట్టబద్ధత కల్పించిన బిసి కార్పోరేషన్ కు, అలాగే యన్.టి.,డి.యన్.టి, అత్యంత వెనుకబడిన తరగతుల  కార్పరేషన్లకు నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. అలగే 2021 లో జరగబోయే జనగణన ప్రతి కులంలో విధ్య ,ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంది అనేది కూడా జరపాలని సూచించారు.

1881 నుంచి జనగణన కులప్రాతిపదికన 1931 వరకూ జరిగిందని చెబుతూ  తరువాత స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెసు పాలకులు బిసిలకు  చేసినంత ద్రోహం ఎప్పటికీ క్షమించరానిదని శివన్నారాయణ విమర్శించారు.