36 లక్షల ఎకరాల్లో పంట నష్టం … పట్టించుకొనే కేసీఆర్ 

భారీ వానలకు పెద్ద ఎత్తున పంటలు నష్టపోతున్నా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పట్టించుకున్న దాఖలాలు లేనే లేవు. కనీసం 36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఇప్పటిదాకా రైతులకు నష్టపరిహారం అందించడంపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. 

క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి, పంట నష్టంపై అంచనా వేయాల్సిన నేతలు ఆ ఊసే  ఎత్తడం లేదు.ఈ ఏ డాది పంట బీమా అమలు చేయలేదు. ఐదేళ్లుగా ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వడం లేదు. 

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు 8 లక్షల ఎకరాల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.

ఈ సీజన్‌‌లో మొత్తం 15 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని తేలింది. కానీ వాస్తవానికి ప్రతి గ్రామానికి ఏఈవోలు, ఏవోలు పర్యటించి సర్వే చేస్తే రెట్టింపు స్థాయిలో పంట నష్టం తేలే అవకాశం ఉందని రైతు సంఘాలు అంటున్నాయి. వానాకాలంలో అత్యధికంగా వేసిన పత్తి, వరి, కంది పంటలు భారీగా దెబ్బతిన్నాయి.

ఈ సీజన్‌‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంట సాగైతే 36 లక్షల ఎకరాలు అకాల వర్షాలతోనే దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. తాజా వర్షాలకే 20 లక్షల ఎకరాల్లో వంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది.10.78 లక్షల ఎకరాల్లో కంది వేస్తే.. 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనాలు ఉన్నాయి.

సోయ, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పెసర, నువ్వులు, మినుముల పంటలకు 4 లక్షల ఎకరాల్లో నష్టం కలిగినట్లు తెలుస్తోంది. వర్షాల వల్ల చేతికొచ్చే దశలో ఉన్న పంటలన్నీ దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి, తీసే దశలో ఉన్న పత్తి, సోయా, మక్కలు నీటి పాలయ్యాయి.

పత్తి చేలలో నీరు నిలవడంతో కాయలు పగిలి దూది వచ్చే దశలో ఉన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దూది నుంచి విత్తనాలు మొలకెత్తాయి. వరి పంట నేలకొరిగింది. వడ్లు తడిసి ముద్దయ్యాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి,-ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది.