పాక్, చైనా భాష మాట్లాడే కాంగ్రెస్ ను బహిష్కరించండి

చైనా, పాక్ పరిభాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు బహిష్కరించాలని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిపిలుపునిచ్చారు. లడఖ్‌లో ఆదివారంనాడు జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు 370 అధికరణను పునరుద్ధరించి, లడఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదాను రద్దు చేస్తామని ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
చైనా మద్దతుతో 370 అధికరణను పునరుద్ధరించి, లడఖ్‌కు కల్పించిన యూటీ హోదాన్ని వెనక్కి తీసుకుంటామని ఫరూఖ్ అబ్దుల్లా కూడా ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ‘మీరు కేంద్ర పాలిత ప్రాంతం హోదాను కోరుకుంటున్నారా? 370 అధికరణను కోరుకుంటున్నారా?’ అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.  
 
 ఈనెల 22న జరగనున్న లెహ్ అటానమస్ హిల్ డవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారా భారత ప్రభుత్వం తప్పు చేసిందని చైనా విదేశాంగ మంత్రి ఒక ప్రకటన చేశారని, మన అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఆయన ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 
 
ప్రజలే లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుకున్నందున తాము ఆ పని చేశామని చెప్పారు. లడఖ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపులను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏళ్ల తరబడి లఢఖ్‌ నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిందని ధ్వజమెత్తారు. 
 
దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ప్రజలు గత 70 ఏళ్లుగా కోరుకుంటున్నారని చెప్పారు. ఆ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకుని లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారని వివరించారు. 
 
‘లడఖ్‌కు 2019-20లో రూ.5,154 కోట్ల బడ్జెట్ ప్రొవిజన్ కల్పించాం. ప్రస్తుత సంవత్సరంలో అది రూ.5,958 కోట్లు చేశాం. సౌరశక్తి ద్వారా లడఖ్‌లో రూ.30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగనుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి’అని తెలిపారు. 
 
`లెహ్-శ్రీనగర్ మధ్య టన్నెల్ రోడ్ రూపొందించనున్నాం. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రధాని కేవలం మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల మనిషి. లడఖ్‌లో మేము పలు అభివృద్ధి పనులు చేపట్టాం’ అని కిషన్ రెడ్డి వివరించారు.