మంగంపేటలో ఇద్దరు మావోలు హతం

ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు.  

ఆదివారం పోలీసులు నక్సలైట్ల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

‘నర్సింహాసాగర్ సమీపంలోని నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొప్పుగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. కూంబింగ్ చేస్తున్న మా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. మా బలగాలపై మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం మా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు’ అని ఏఎస్పీ సాయిచైతన్య ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపడం సంచలనం రేపింది. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రతిష్టగా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఇదిలా ఉంటే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పంబాపూర్‌ గ్రామ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడలపై అతికించిన లేఖ కలకలం సృష్టించింది. గత కొన్నిరోజులుగా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టిన నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ నక్సలైట్‌లు లేఖ రాయడంపై ఆయా పార్టీల ప్రజా ప్రతినిధుల్లోనూ వణుకు మొదలైంది.

కరీంనగర్‌ , ఖమ్మం, వరంగల్‌ ఏరియా కమిటీ పేర కరపత్రాలను ప్రత్యక్షం అయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌ బంటు రమేష్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా యాక్షన్ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా తమకు సమాచారం ఉన్నదని ములుగు ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు కూడా సమాచారం ఉన్నదని పేర్కొన్నారు.

ఈ సమాచారం మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో ములుగు జిల్లా ప్రత్యేక బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగానే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు మగ మావోయిస్టులు మరణించారని చెప్పారు. పోలీసు బలగాలు తాడువాయి, పసర, మంగపేట తదితర ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.