ల‌డాఖ్ స‌రిహ‌ద్దులో చైనా సైనికుడిని అరెస్ట్ 

ల‌డాఖ్ స‌రిహ‌ద్దులో చైనా సైనికుడిని భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకున్నాయి.  పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన జ‌వాను అనుకోకుండా భార‌త భూభాగంలోకి ప్రవేశించి ఉంటార‌ని భావిస్తున్నారు.  దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉన్న‌ది.

ఇటీవ‌ల ల‌డాఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. జూన్ 14వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతిచెందారు. ఆ నాటి నుంచి స‌రిహ‌ద్దు మ‌రింత టెన్ష‌న్‌గా మారింది.

ల‌డాఖ్‌లోని చుమ‌ర్‌-డెమ్‌చోక్ ప్రాంతంలో చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.  అయితే ప్రోటోకాల్ ప్రకారం స‌మాచారం సేక‌రించిన త‌ర్వాత అత‌న్ని తిరిగి పీఎల్ఏ ద‌ళానికి అప్ప‌గించ‌నున్నారు. చైనా సైనికుడి వ‌ద్ద సివిల్‌, మిలిట‌రీ డాక్యుమెంట్లు ఉన్న‌ట్లు భార‌త అధికారులు గుర్తించారు.

పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికుడిని కార్పోర‌ల్ వాంగ్ యా లాంగ్‌గా గుర్తించారు. తూర్పు ల‌డాఖ్‌లోని డెమ్‌చోక్ వ‌ద్ద అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.  ఎల్ఏసీ దాటి వ‌చ్చాడ‌త‌ను.  అత‌నికి వైద్య సాయం చేశారు.  ఆహారం, వేడి వ‌స్త్రాల‌ను అందించారు.

అత్యంత శీత‌ల వాతావ‌ర‌ణం, ఎత్తైన ప్ర‌దేశాల నుంచి అత‌ను భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తున్న‌ది.  సైనికుడు మిస్సైన‌ట్లు పీఎల్ఏ.. భార‌త్‌కు ఓ అభ్య‌ర్థ‌న‌లో తెలిపింది. అయితే ప‌ద్ధ‌తి ప్ర‌కారం.. చుషుల్ మోల్డోలో చైనా అధికారుల‌కు అత‌న్ని అప్ప‌గించ‌నున్న‌ట్లు భార‌తీయ ద‌ళాలు వెల్ల‌డించాయి.