జస్టిస్ రమణపై జగన్ లేఖపై చర్చ జరగాల్సిందే 

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై చీఫ్‌ జస్టిస్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి రాసిన లేఖపై చర్చ జరగాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న లోపాలపై లేఖలు రాయడం కొత్తేమీ కాదని, 1961లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి చంద్రారెడ్డిపై అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. 

జస్టిస్‌ ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదని అంటూ  2005లో రిటైర్డ్‌ జడ్జి బీఎస్‌ఏ స్వామి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాసిన పుస్తకంలో జస్టిస్‌ రమణ గురించి ఒక పేరాలో ప్రస్తావించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో రమణ అడ్వకేట్‌ జనరల్‌గా కూడా పనిచేశారన్నారని గుర్తుచేశారు.

అలాగే, రాజధాని భూబాగోతంలో జరుగుతున్న దర్యాప్తుపై రాష్ట్ర హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం సరికాదని ఉండవల్లి చెప్పారు. గ్యాగ్‌ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వారిపై ఏమన్నా మాట్లాడితే కోర్టులు ఒప్పుకోవనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని వారించారు. జడ్జీలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని హితవు చెప్పారు.

హైకోర్టులో రాష్ట్ర డీజీపీతో ఐపీసీ సెక్షన్‌–151 చదివించారని, అంత అవసరమా? మేం రాష్ట్ర ప్రభుత్వం కన్నా బలవంతులమని చెప్పాలనుకుంటుందా అని ఉండవల్లి ప్రశ్నించారు. లెజిస్లేచర్‌కు, జ్యుడీషియరీకి ఉన్న సంబంధం చెడిపోతే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ఉండవల్లి హెచ్చరించారు.

పైగా, జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవాలంటే పార్లమెంట్‌లో అభిశంసన జరగాలని ఉండవల్లి సూచించారు. ఇది ఆమోదం పొందాలంటే లోక్‌సభలో వంద మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల మద్దతు అవసరమని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కేసులపై ఆయన స్పందిస్తూ\వీటిల్లో ఆయనకు శిక్షపడే అవకాశం లేదని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల ట్రయల్స్‌ లైవ్‌ టెలీకాస్ట్‌ ఇవ్వాలంటూ ఈ నెల 13న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు తాను లేఖ రాసినట్లు మాజీ ఎంపీ వెల్లడించారు. చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్జీల నియామకానికి పరీక్షలు లేవని ఉండవల్లి చెబుతూ గతంలో తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా పాదాలు పట్టుకున్న వారిని జడ్జీలుగా నియమించారని ఆరోపించారు.

చట్టం ముందు అందరూ సమానమే అనడం తప్పని అంటూ అలా అయితే చంద్రబాబుపై ఉన్న కేసుల పురోగతి మాటేమిటని ప్రశ్నించారు. అలాగే, మార్గదర్శిపై తాను వేసిన కేసు తనకు తెలియకుండానే ఉమ్మడి హైకోర్టు 2018లో కొట్టివేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని ఉండవల్లి స్పష్టంచేశారు.