
జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత హింసాకాండ, ఉగ్ర దాడులపై ఆ దేశ పాత్రను ఈ నెల 22న రట్టు చేసేందుకు భారత్ సిద్ధమైంది. 1947 అక్టోబర్ 22న జమ్ముకశ్మీర్ రాజ్యంపై పాకిస్థాన్ దాడి చేసింది. ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో వేలాది మంది కశ్మీర్ ప్రజలను హతమార్చి కొంత భాగాన్ని ఆక్రమించింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన హిందువులు, సిక్కులు భారత్‌కు వలస వచ్చారు.
జమ్ముకశ్మీర్ రాజ్యాన్ని భౌగోళికంగా విడదీసి ఆ ప్రాంత సంస్కృతిని ధ్వంసం చేసిన పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌లోని పీవోకే శరణార్థులు ప్రతిఏటా అక్టోబర్ 22ను బ్లాక్ డేగా పాటిస్తారు. ఆ రోజున పాక్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో నాడు ఆపరేషన్ గుల్మార్గ్‌కు నేతృత్వం వహించిన పాక్ మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ తన పుస్తకంలో స్వయంగా పేర్కొన్న అసలు వాస్తవాన్ని బయటపెట్టేందుకు భారత్ సిద్ధమైంది.
జమ్ముకశ్మీర్ రాజ్యాన్ని ఆక్రమించేందుకు పాకిస్థాన్ మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ ఆదేశాలతో 1947 అక్టోబర్ 22న ఆ దేశ సైన్యం ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో దాడి చేసింది. అక్టోబర్ 24న ముజఫరాబాద్, డోమెల్‌ను ఆక్రమించింది. 26న బారాముల్లా ప్రాంతాన్ని పాక్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఈ ప్రాంతంలోని 14 వేల మంది ప్రజల్లో కేవలం మూడు వేల మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.
అనంతరం శ్రీనగర్‌కు 35 కిలోమీటర్ల దూరానికి పాక్ సైన్యం చేరుకున్నది. దీంతో జమ్ముకశ్మీర్ మహారాజు హరిసింగ్ భారత్ సహాయం కోరారు. తన రాజ్యాన్ని భారత్‌లో కలిపేందుకు సమ్మతి తెలిపే పత్రాలను అక్టోబర్ 26న ఢిల్లీకి పంపారు. దీంతో అక్టోబర్ 27న భారత్ జోక్యం చేసుకున్నది. సైన్యాన్ని కశ్మీర్‌కు పంపింది. పాక్ సైన్యం శ్రీనగర్‌కు చేరకుండా భారత్ సైన్యం నిలువరించింది.
ఈ ఘటన అనంతరం జమ్ముకశ్మీర్ రాజ్యం రెండు ముక్కలైంది. పాకిస్థాన్ స్వాధీనంలోని ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా, భారత్ ఆధీనంలోని ప్రాంతాన్ని భారత జమ్ముకశ్మీర్‌గా వ్యవహరిస్తున్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ ఆక్రమణ కోసం అక్కడి గిరిజన యోధులను పాకిస్థాన్ ఎలా ప్రేరేపించింది, వారికి ఆయుధాలను అందజేసిన తీరును ఆపరేషన్ గుల్మార్గ్‌కు నేతృత్వం వహించిన పాక్ మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ తన పుస్తకం ‘రైడర్స్ ఇన్ కశ్మీర్’లో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ దాడి గురించి సమగ్రంగా ఆయన వివరించారు.
లాహోర్, రావల్పిండిలో ఈ కుట్రకు బీజం పడిందని చెప్పారు. 1947 సెప్టెంబర్ ప్రారంభంలో జమ్ముకశ్మీర్‌ను స్వాధీనం చేసుకునే ప్రణాళికను సిద్ధం చేయాలని నాటి పాలక ముస్లిం లీగ్ నాయకుడైన మియాన్ ఇఫ్తీఖారుద్దీన్ తనను కోరినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో తాను ‘కశ్మీర్‌లో సాయుధ తిరుగుబాటు’ పేరుతో ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానిని ఆయనకు పంపినట్లు చెప్పారు.
కశ్మీరీలను అంతర్గతంగా బలోపేతం చేయడంపై ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉండాలని, అదే సమయంలో భారతదేశం నుండి కశ్మీర్‌లోకి సాయుధ పౌరులు లేదా సైనిక సహాయం రాకుండా నిరోధించడానికి చర్యలు తీసుకునే వీలుగా తాను ప్రతిపాదించినట్లు అని ఖాన్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
మరోవైపు నాటి పాక్ దాడి, దురాగతాన్ని జమ్ముకశ్మీర్ తొలి ప్రధాని షేక్ అబ్దుల్లా 1948లో ఐక్యరాజ్య సమితికి వివరించారు. 1947 అక్టోబర్ 26న బారాముల్లాలో 11 వేల మందిని పాక్ సైన్యం చంపిందని తెలిపారు. వేలాది మంది ప్రజలను ఊచకోత కోసారని, చనిపోయినవారిలో ఎక్కువగా హిందువులు, సిక్కులు ఉండగా కొంత మంది ముస్లింలు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.
హిందువులు, సిక్కులతోపాటు ముస్లింల ఆస్తులు లూఠీ చేశారని, ఆడవారిని ఎత్తుకుపోయారని తెలిపారు. మెహ్రాలోని విద్యుత్ స్టేషన్‌ను పాక్ సైన్యం ధ్వంసం చేయడంతో శ్రీనగర్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌కు సమీపానికి పాక్ సైన్యం చేరుకున్నదని షేక్ అబ్దుల్లా వెల్లడించారు.
మతతత్వ అల్లర్లలో జమ్ములో ముస్లింలు చంపబడుతున్నందున విముక్తి కోసం గిరిజన యోధులు పోరాడుతున్నారని, వారి మతపరమైన బాధ్యత జిహాద్‌ను నెరవేర్చడానికి గిరిజన యోధులు కశ్మీర్ వచ్చారు అనే అపోహను కల్పించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిందని చెప్పారు. వాస్తవానికి ముస్లింలను కూడా ఆ దేశం విడిచిపెట్టలేదని ఆయన ఆరోపించారు.
1947 అక్టోబర్ 21-22 మధ్య రాత్రిన ఆపరేషన్ గుల్మార్గ్‌ను పాకిస్థాన్ ప్రారంభించిదని, జమ్ముకశ్మీర్ చరిత్రలో అది చీకటి రోజు అని యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ (EFSAS) పేర్కొంది. నాడు పాకిస్థాన్ ధ్వంసం చేసిన ఆలయాలు నేటికి అక్కడ అలాగే ఉన్నాయని తెలిపింది.
కాగా, జమ్ముకశ్మీర్ ఆక్రమణ కోసం ఆపరేషన్ గుల్మార్గ్‌ను పాకిస్థాన్ చేపట్టి 73 ఏండ్లు అవుతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ రాజ్యంపై 1947 అక్టోబర్ 22 నాటి పాకిస్థాన్ దాడి నుంచి నేటి వరకు ఆ దేశం పాల్పడిన హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడుల గురించి చారిత్రక ఆధారాలతో సహా పాక్ ప్రాత, కుతంత్రాలను ప్రపంచానికి వెల్లడించేందుకు భారత్ సన్నద్ధమైంది.
More Stories
మందుపాతరాలతో మావోయిస్టులు భద్రతా బలగాల కట్టడి!
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!