బెంగాల్‌లో చట్టబద్ధపాలన లేదని గవర్నర్ ఆందోళన 

పశ్చిమ బెంగాల్‌లో చట్టబద్ధపాలన లేదని ఆ రాష్ట్ర‌ గవర్నర్ జగదీప్ ధం‌కర్ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలు, రాజకీయ హింసాకాండ, కక్షపూరిత రాజకీయాలు, కస్టోడియల్ హింస విపరీతంగా పెరుగుతున్న‌ద‌ని ఆయ‌న ధ్వజమెత్తారు. 
 
పశ్చిమ బెంగాల్‌లో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని గవర్నర్ మండిప‌డ్డారు. ఓ సిక్కు వ్యక్తి తలపాగాకు సంబంధించి జరిగిన వివాదాన్ని ఈ సందర్భంగా ధంక‌ర్‌ ప్రస్తావించారు. బల్వీందర్ సింగ్ తలపాగా వివాదం బెంగాల్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల తీవ్రతకు నిదర్శనమని ఆయ‌న‌ తెలిపారు.
మదన్ ఘోరాయ్ కస్టోడియల్ డెత్ ప‌శ్చిమ‌బెంగాల్‌లో భయానక, అమానుష హింసకు మరొక నిదర్శనమని గ‌వ‌ర్న‌ర్ ధంక‌ర్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన కొన‌సాగించాల‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మమత బెనర్జిని గ‌వ‌ర్న‌ర్ కోరారు.
ఇప్పటికే రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన పరాకాష్ఠకు చేరిందని స్పష్టం చేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పర్యవసానాలను ఎదుర్కొనకుండా ఉండాలంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ధన్‌కర్ హెచ్చ‌రించారు.