30 కోట్ల మందికి మొదట కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ కోసం కార్యాచరణ సిద్ధం చేసింది. తొలిదశలో ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై స్పష్టమైన అవగాహనకు వచ్చింది. 

దేశంలోని 30 కోట్ల మందికి మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం సమీక్ష నిర్వహించి విపత్తు, ఎన్నికల నిర్వహణల్లాగానే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.    కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ప్రజలను నాలుగు వర్గాలుగా విభజించారు.

అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందికి మొదట టీకాలు వేస్తారు. ఆ తర్వాత రెండు కోట్లమంది పోలీస్‌, మున్సిపల్‌, ఇతర భదత్రాబలగాల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఉంటుంది. మూడో దశలో 50 ఏండ్లు పైబడిన 2 కోట్లమందికి టీకాలు వేస్తారు. నాలుగో దశలో 50 ఏండ్లలోపు ప్రజలందరికీ టీకాలు వేస్తారు.

70 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, 2 కోట్ల మంది రక్షణ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 26 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలు (50 ఏళ్లకు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వ్యక్తులు) ఈ జాబితాలో ఉన్నారు. 

బూస్టర్ డోస్ తో కలిసి తొలి విడతలో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని భావిస్తున్నారు. మొదటి దశలో టీకా అందుకునేవారి జాబితాను అక్టోబరు చివరినాటికి, లేదా నవంబరు మొదటివారం నాటికి సిద్ధం చేయనున్నట్లు కేంద్ర తెలిపింది.