ఎగువ నుండి చేరుతోన్న వరద ఉధృతికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం 7.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింత ప్రాజెక్టు నుండి 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఈరోజు రాత్రి 11 గంటల సమయంలో 9 నుండి 9.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజికి చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత లంకగ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.
మరో వైపు.. కృష్ణా నది తీరాన్ని ఆనుకొని ఉన్న పర్యాటక కేంద్రం భవానీద్వీపం వరద నీట మునిగింది. ద్వీపం అందాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ద్వీపానికి వచ్చే పర్యాటకులందరినీ అధికారులు తిరిగి వెనక్కు పంపుతున్నారు.
ఇదిలా ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో వేసిన కంద, పసుపు, అరటి, మినుము, పెసర పంటలు నీటమునిగాయి. వందలాది ఇళ్లు జలదిగ్బంధమయ్యాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం ఎడ్లంక గ్రామంలో ఉన్న మైనేని హరిప్రసాదరావు అనే వ్యక్తి ఇల్లు వరద ఉధృతికి ధ్వంసమైంది. ఎడ్లంక గ్రామం కోతకు గురవుతోందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
కాగా, శ్రీశైలానికి ఎగువ నుంచి వరద పొటెత్తుతోంది. గంటగంటలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువన కర్ణాకటలో భారీ వర్షాలు కురుస్తుండటం, తుంగభద్ర, జూరాల గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తుండటంతో భారీగా వరద వస్తోంది.
ఈ ఉదయానికి జలాశయానికి 6,53,302 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి దిగువ స్పిల్ వే ద్వారా 6 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి ఈ ఉదయం 5,28,314 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు ప్రాజెక్టు 18 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 4,91,370 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు
More Stories
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
ఒకేరోజు 13,326 గ్రామసభలతో ఏపీ ప్రపంచ రికార్డు