ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు 

పవిత్ర కృష్ణానది తీరంలో అపర భూకైలాసంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి అంగరంగవైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృతదుర్గా దేవిగా  ‘అమ్మ’ దర్శనమిస్తున్నారు. 

పూర్వం మాధవవర్శ అనే రాజు ధర్మనిరతికి మెచ్చి కీలాద్రిపై జగజగ్జనిగా అవిర్భవించింది. ఇంద్రుడు జగజ్జనని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రిగా భక్తులు పూజలు అందుకుంటోంది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా తొలిరోజు పూజ అందుకుంటుంది. 

రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లును దేవస్ధానం అధికారులు చేస్తున్నారు. శనివారం ఉదయం జరిగే స్నప్నభిషేకం, బాలభోగనివేదన, అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. 

కోవిడ్‌ నిబంధనలు తూచాతప్పకుండా పాటిస్తూ రాత్రి 8 గంటలకు దేవాలయాన్ని మూసివేస్తారు. ప్రతినిత్యం 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిçస్తున్నారు. మూలనక్షత్రం(ఆక్టోబర్‌ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు.

24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మ«ధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు, అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం హంసవాహనంపై గంగ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారు కృష్ణానదిలో విహరిస్తారు.

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు  దంపతులు శనివారం అమ్మవారిని పట్టువస్త్రాలను సమర్పించారు. దసరా ఉత్స వాలలో  ప్రతి ఏటా నగర పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీ.