అగ్ర రాజ్యాలను సహితం సవాల్ చేసే రీతిలో మేటిగా అణు, అంతరిక్ష శస్త్ర విజ్ఞానంలో భారత్ నేడు అభివృద్ధి చెందింది. ఈ రంగాలలో భారత్ ను అగ్రరాజ్యంగా చెప్పుకోవచ్చు. అంతటి ఖ్యాతి మనకు తీసుకు వచ్చింది ఈ రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మాత్రమే.
ప్రపంచంలోనే అతి చవుకగా లభించే అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఈ రంగాలలో మన శాస్త్రవేత్తలు స్వీయ ప్రతిభతో తమ పరిశోధనల ద్వారా అభివృద్ధి చేశారు. ఈ దేశాలలో భారత్ సహకారం కోసం నేడు మొత్తం ప్రపంచం మనవైపు చూస్తున్నది. అయితే ఈ శాస్త్రవేత్తలు ప్రతి ఏడాది వందల సంఖ్యలో అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉద్యమకారుడు చేతన్ కొఠారీ బాంబే హైకోర్టులో అణు శాస్త్రవేత్తల మరణాలకు సంబంధించి ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సమాధానంగా గత 15 ఏండ్లలో 1,540 మంది అణు శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో మరణించారని ఆయనకు సమాధానం వచ్చింది. అంటే ప్రతి వారం ఇద్దరు శాస్త్రవేత్తలు చనిపోతున్నారు అన్నమాట.
ఈ మరణాలను ఆత్మహత్యలుగా, కారణం తెలియని మరణాలుగా ప్రభుత్వం రికార్డుల్లో చేర్చిందని ఆయనకు సమాధానం వచ్చింది. కానీ పలు వర్గాలలో ఈ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అణు కేంద్రాల్లో పనిచేసే శాస్త్రవేత్తలపై రేడియేషన్ ప్రభావం ఉంటుందని, దీంతో క్యాన్సర్ వంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు లోనవ్వడంవల్లే వాళ్లు మరణిస్తున్నారని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) అధికారులు చెబుతున్నారు. ఒత్తిడి, కుటుంబ వ్యవ హారాలు తదితర కారణాలు కూడా శాస్త్ర వేత్తలు ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.
ఈ రంగాలలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపం చంలో అనేక దేశాలు సహించలేక పోతున్నాయి. ముఖ్యంగా భారత్ కీలకమైన అణు సాధన సంపత్తిని కలిగిఉండడాన్ని తట్టుకోలేక పోతున్నాయి. మన శాస్త్రవేత్తల పరిశోధనలకు మొదటి నుండి అడుగడుగున్నా అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. దానితో మన శాస్త్రవేత్తలు అనేకమంది అనుమానాస్పదంగా చనిపోతూ ఉండడం మరి అనేక అనుమానాలకు దారితీస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ ముఖ చిత్రమే మారిపోయింది. యుద్ధం అనంతర పరిస్థితులను బేరీజు వేసుకున్న పలు దేశాలు భవిష్యత్ రక్షణ అవసరాల దృష్ట్యా అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవడానికి ఆసక్తి కనబరిచాయి. ఈ క్రమంలో అణు శాస్త్రవేత్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే దేశ రక్షణకు అవసరమైన అణ్వాయుధాలను తయారుచేసే అణు శాస్త్రవేత్తలకు ఎంతటి గౌరవం దక్కుతున్నదో, అంతే దయనీయ స్థితిలో వాళ్ల బతుకులు అర్ధాంతరంగా తెల్లారుతున్నాయి. దేశ శ్రేయస్సు కోసం పాటుపడే ఈ శాస్త్రవేత్తలు అనూహ్యంగా మరణిస్తున్నారు. వారి మరణాలు చిదంబర రహస్యంగా మిగిలిపోతున్నాయి.
భారత దేశం నేడు అణ్వాయుధాలు గల దేశంగా నిలబడడానికి కారణం విఖ్యాత అణు శాస్త్రవేత్త హోమీ జెహాంగీర్ బాబా దూరదృష్టి మాత్రమే అని చెప్పవచ్చు. ఆయన సారథ్యంలోనే ఈ రంగంలో భారత్ పరిశోధనలను ప్రారంభించింది. భారత్ అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలని స్వాతంత్య్రం ముందు నుండే చెబుతూవచ్చారు. అంతే కాదు నాటి కాంగ్రెస్ అగ్రనేతలను ఈ విషయమై ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆయన పట్టుదల కారణంగానే నేడు ఈ రంగంలో అగ్రరాజ్యంగా నిలబడినది.
అణుశాస్త్రంలో 1933లోనే డాక్టరేట్ పొంది, ఇంగ్లాండ్ లోని ప్రతిష్టాకర అధ్యయన సంస్థలలో పనిచేస్తూ, సెప్టెంబర్ 1939లో రెండో ప్రపంచ యుద్ధంకు ముందు సెలవులకు భారత్ వచ్చిన ఆయన ఇక తిరిగి వెళ్ళలేదు. బెంగుళూరులో గల సర్ సివి రామన్ నేతృత్వంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సెస్ భౌతికశాస్త్ర విభాగంలో రీడర్ గా చేశారు. టాటా ట్రస్ట్ నుండి లభించిన గ్రాంట్ తో కాస్మిక్ రే పరిశోధన కేంద్రంను ఐఐటి లోనే ఏర్పాటు చేశారు.
తర్వాత 1945లో జె ఆర్ డి టాటా సహాకారంతో టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. అదే తర్వాత ప్రపంచంలోనే అత్యున్నతమైన బాబా అణు పరిశోధనా సంస్థగా అభివృద్ధి చెందింది. స్వాతంత్య్రం ముందు కాలం నాటి నుండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను, ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూను భారత్ అణుశక్తి సముపార్జించుకొనే విధంగా ఒప్పించే ప్రయత్నం బాబా చేశారు.
స్వాతంత్య్రం తర్వాత నెహ్రు తొలి ప్రధాని కావడంతో ఆయన ప్రయత్నం ఫలించింది. 1948లో ఏర్పాటు చేసిన భారత్ అటామిక్ ఎనర్జీ కమీషన్ తొలి చైర్మన్ గా బాబా వ్యవహరించారు. భారత్ సత్వరం అణ్వాయుధాలను సముపార్జించుకొనే టట్లు చేయడం కోసం నెహ్రు 1948లో బాబా డైరెక్టర్ గా నియమించారు. 1966లో జర్మనీలో అణుశాస్త్రవేత్తల మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన బాబా తిరిగి ప్రయాణంలో అనుమానాస్పద పరిష్టితుల్లో మృతి చెందారు.
సమావేశం ముగియడం ఆలస్యం కావచ్చని ఆయనకు ఆ రోజు సాయంత్రం, మరుసటి రోజు ఉదయం విమానాలలో తిరుగు ప్రయాణంకు రిజర్వేషన్ చేశారు. ఆయన ఎట్టి పరిస్థితులలో బ్రతకడానికి వీల్లేదు అన్నట్లు ఆ రెండు విమానాలు కూడా కూలిపోయాయి. సాయంత్రం విమానంలో ప్రయాణించిన ఆయన మృతి చెందారు. ఈ కుట్ర ఇప్పటి వరకు మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఇలా ఉండగా, కేరళ ప్రభుత్వం 1994లో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ ను అరెస్ట్ చేయడం, సుదీర్ఘకాల విచారణ అనంతరం ఆయన నిరపరాధి అని తేలడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు రూ 1.3 కోట్ల పరిహారం చెల్లించామని కోర్ట్ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ పరిహారం 78 ఏళ్ళ వయస్సులో ఆయనకు అందింది. కానీ ఆయన సేవలు ఇస్రోకు దూరమయ్యాయి. ఈ సందర్భంగా మన శాస్త్రవేత్తలు పలు కుట్రలకు బలవుతున్నట్లు కూడా అనుమానించవలసి వస్తున్నది. మన శాస్త్రవేత్తలు అణు, అంతరిక్ష రంగాలలో అగ్రరాజ్యాలకన్నా మెరుగైన, తక్కువ వ్యయం కాగల సాంకేతిక పరిజ్ఞానంను అభివృద్ధి చేశారు. అందుకనే బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు సహితం తమ సాటిలైట్ లను భారత్ నుండి ప్రయోగిస్తున్నాయి.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం