శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్‌ సింగ్‌  కాల్చివేత

శౌర్యచక్ర అవార్డు గ్రహీత, పంజాబ్‌కు చెందిన బల్వీందర్‌ సింగ్ ‌‌(62)ను దుండగులు కాల్చి చంపారు. తారన్‌ తారన్‌ జిల్లాలో  భిఖివింద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 
 
సింగ్ తన ఇంటి పక్కనే ఉన్న కార్యాలయంలో ఉండగా బైక్‌పై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల నిర్మూలనకు ఏళ్ల తరబడి ఆయన ఎంతోధైర్య సాహసాలతో పోరాడారు.
అంతకుముందు చాలాసార్లు ఉగ్రవాదులు ఆయనను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినా ప్రాణాలతో బయటపడ్డారు. తారన్‌ తారన్‌ పోలీసుల విజ్ఞప్తి మేరకు గతేడాది బల్వీందర్‌ సింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది.
తమ కుటుంబం మొత్తం ఉగ్రవాదుల హిట్‌ లీస్టులో ఉందని బల్వీందర్‌ సింగ్‌ సోదరుడు రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో బల్వీందర్‌ సింగ్‌ జరిపిన అసమాన పోరాటానికి రక్షణమంత్రిత్వశాఖ 1993లో ఆయనకు శౌర్య చక్రం ఇచ్చింది. అతడి ధైర్యసాహసాలపై అనేక డాక్యుమెంటరీలు సైతం రూపొందించారు.