ఆరావళి కొండల్లో పచ్చదనం పెంచడానికి ‘మిషన్ గ్రీన్ ఆరావళి’ పేరుతో జాతీయ భద్రతా దళం చేస్తున్న కృషిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దీ నెలల్లోనే ఎన్ఎస్జి కమాండోలు రెండు లక్షలకు పైగా మొక్కలను నాటారు.
ఎన్ఎస్జి 36 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి, సిబ్బంది, వారి కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “సర్వత్ర సర్వోత్తం సురక్ష” అనే తమ నినాదానికి అనుగుణంగా జీవిస్తున్న అధికారులను, సిబ్బందిని అభినందించారు.
ఎన్ఎస్జి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, ఒక అత్యంత-సమర్థవంతమైన వ్యక్తుల బృందమని, మన దేశాన్ని, మన పౌరులని రక్షించడం కోసం వీరు తుది శ్వాస వరకు పట్టు వదలకుండా పోరాడతారని అంటూ కిషన్ రెడ్డి వారి సేవల్ని కొనియాడారు.
ఈ కారణంగానే, ఎన్ఎస్జి ప్రతి పౌరుడి హృదయంలో ప్రత్యేక స్థానం పొందిందని పేర్కొన్నారు. ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలోని, దూరదృష్టి గల కేంద్ర ప్రభుత్వం, దేశమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
గత అనుభవాలను, భవిష్యత్ సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతమైన వాహనాలు, ఆధునిక ఆయుధాలతో ఎన్ఎస్జిని, కేంద్రం బలోపేతం చేస్తోందని తెలిపారు.
జాతీయ భద్రతా దళాన్ని మరింత ధృఢంగా చేయడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అంతకుముందు, డైరెక్టర్ జనరల్ సుర్జీత్ సింగ్ దేస్వాల్ గత కొన్ని సంవత్సరాలుగా కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ హైజాకింగ్, అత్యంత ముప్పు గల వ్యక్తుల రక్షణ (హెచ్టిపి), రాష్ట్ర పోలీసు దళాల సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి వృత్తిపరమైన రంగాల్లో ఎన్ఎస్జి ఏ విధంగా విజయాలు నమోదు చేసిందో వివరించారు. ఎన్‌ఎస్‌జికి చెందిన 19 మంది అమరవీరులకు అంకితం చేసిన ‘‘శౌర్య’’ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.
More Stories
మిత్రుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు
ప్రత్యేక హోదా పునరుద్దరించాలని కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు