కాశ్మీర్ నుండి భారత్ ను వేరు చేయాలనా?

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ లక్ష్యంతో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన చిరకాల ప్రత్యర్థి జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడటంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ హర్‌నాథ్ సింగ్ యాదవ్ మండిపడ్డారు. భారత్ నుంచి కశ్మీర్‌ను వాళ్లు వేరు చేయాలనుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. 
 ‘ఫరూక్ అబ్దుల్లా, ఆయనతో ఉన్న కూటమి భారత్ నుంచి కశ్మీర్‌ను వేరుచేయాలని అనుకుంటోంది. దీనిపై వాళ్లు బాహటంగానే మాట్లాడుతున్నారు’ అంటూ దుయ్యబట్టారు.
`ఆయన (ఫరూక్) విడుదలైనప్పుడు, జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణను పునరుద్ధరించేందుకు చైనా సాయం తీసుంటామంటూ బాహాటంగానే మాట్లాడారు. వారి ఉద్దేశం ఏమిటో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని హర్‌నాథ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌ను పీడీపీ, ఎన్‌సీపీ నేతలు ఏర్పాటు చేయడంపై యాదవ్ మండిపడుతూ ‘వాళ్లు విష సర్పాలు. తక్షణం వాళ్లను జైళ్లలో పెట్టాలి. లోపలున్న విషం కక్కించేంత వరకూ జైళ్లలోనే ఉంచాలి’ అని  ధ్వజమెత్తారు.
కాగా, ఫరూక్ అబ్దుల్లా ఇటీవల మాట్లాడుతూ, తమది రాజ్యాంగపరమైన పోరాటమని అన్నారు. 2019కి ముందు (370 అధికరణ రద్దుకు ముందు) రాష్ట్ర ప్రజలకు ఉన్న హక్కులను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వాన్ని తాము కోరుతున్నట్టు చెప్పారు.