ఆహార స‌ర‌ఫ‌రాలో భార‌త పాత్ర‌ చ‌రిత్రాత్మకం     

ఆహార స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త పాత్ర‌, భాగ‌స్వామ్యం చ‌రిత్రాత్మ‌క‌మైంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
 ప్రపంచవ్యాప్తంగా పోషకాహారలోపాన్ని తొలగించడానికి నిరంతరం కృషి చేస్తున్న వారిని ప్రధాని అభినందించారు. భారతదేశంలోని రైతులు, అన్నదాత‌లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అంగన్వాడీ-ఆశా కార్య‌క‌ర్త‌లు పోషకాహార లోపానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరంద‌రి ప‌రిశ్ర‌మ వ‌ల్లే దేశం అన్న‌క్షేత్రంగా వ‌ర్థిల్లుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.
పేద‌ల వ‌ద్దకు ప్ర‌భుత్వం చేర‌డంలో వీరి స‌హ‌కారం ఎంతో ఉందని ప్రధాని పేర్కొ‌న్నారు. క‌రోనా సంక‌ట స‌మ‌యంలోనూ రైతుల స‌హ‌కారం వ‌ల్లే పోష్టికాహార లోపంపై బ‌ల‌మైన పోరాటం చేశామ‌ని తెలిపారు. 2014 త‌ర్వాత దేశంలో కొత్త చ‌రిత్ర ప్రారంభ‌మైంద‌ని, స‌మ‌గ్ర విధానం రూపంలో ముందుకు సాగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
 2023ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇయ‌ర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ఎఫ్ఏవో ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేస్తూ దానికి భార‌త మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుందని పేర్కొ‌న్నారు.  పోష‌కాహార స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు 17 ర‌కాల కొత్త వంగ‌డాల‌ను విడుదల  చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్లడించారు.
చిన్న రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డానికి ఎఫ్‌పీవోల నెట్వ‌ర్క్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.
మ‌హిళ‌ల వివాహ వ‌య‌సుకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. అయితే దీనిపై ఏర్పాటు చేసిన క‌మిటీ ఎందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌ని దేశం నలుమూల‌ల నుంచి ఆడ కూతుళ్లు లేఖ‌లు రాస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
నివేదిక వ‌చ్చిన వెంట‌నేపెళ్లి వ‌య‌సుకు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు మోదీ చెప్పారు.  తన ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో అమలు చేసిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, మన దేశంలో పాఠశాలల్లో నమోదైన బాలుర కన్నా బాలికల సంఖ్య ఎక్కువ ఉందని, ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పారు. 
ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఏవో)‌కు 75 ఏళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ 75 రూపాయాల స్మార‌క నాణాన్ని విడుదల చేశారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎనిమిది పంట‌ల‌కు సంబంధించిన 17 ర‌కాల బ‌యోఫోర్టిఫైడ్ వెరైటీల‌ను కూడా జాతికి అంకితం చేశారు.