దేశంలో తగ్గుముఖం పట్టిన వైరస్ ఉధృతి 

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్ట్డం, కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పట్టడానికి ఎక్కువ సమయం పట్టడం ఊరటనిస్తోంది. 

ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 25 రోజులు పడితే ఇప్పుడది 73 రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. స్వల్పకాలంటో డబ్లింగ్ సమయం 25 రోజులనుంచి 73 రోజులకు పెరగడం వైరస్ వ్యాప్తి నియంత్రణకు సూచికగా ప్రభుత్వం భావిస్తోంది. 

అంతేకాకుండా రోజువారీ మరణాల సంఖ్య కూడా వెయ్యినుంచి 600కు తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసులకన్నా కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. 

ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య దాదాపు 64 లక్షలకు దాటింది. దాదాపు 79 శాతం రికవరీలు పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని, దీంతో కరోనా రికవరీ రేటు 87 శాతాన్ని దాటిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులున్న మహారాష్ట్రలో ఒక్క రోజే 19,000 మందికి పైగా కోలుకోగా, కర్నాటకలో 8000కు పైగా రికవరీలున్నాయని ఆ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్టులను భారీగా నిర్వహించడం, ట్రాకింగ్ ద్వారా వైరస్‌కు గురయిన వారిని సమర్థవంతంగా గుర్తించిమెరుగైన చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలుగుతున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇక దేశవ్యాప్తంగా కరోననా నిర్ధారణ పరీక్షలు కూడా భారీగా చేపడుతున్నారు. నిత్యం సగటున పది లక్షలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 9 కోట్లకు పైగా పరీక్షలు జరిపారు. దేశంలో ర్యాపిడ్ టెస్టులతో పాటుగా 1944 ల్యాబ్‌ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 12 కోట్ల టెస్టులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 9 కోట్లకు పైగా టెస్టులతో భారత్ రెండో స్థానంలో ఉంది.

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 63,371 మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. ఇందులో 8,04,528 యాక్టివ్ కేసులు ఉండ‌గా, మ‌రో 64,53,780 మంది బాధితులు కోలుకున్నారు.

నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 895 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 1,12,161కి పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నిన్న ఒకేరోజు 10,28,622 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు 9,22,54,927 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.