తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్‌ చేసి వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. 
 
భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్‌లతో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్‌లో తెలిపారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. 
వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ ట్వీట్‌ను తెలుగులోనే చేయడం గమనార్హం.
 
వాయుగుండం తీరం దాటిందని ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు.  అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి సీఎం జగన్‌ వివరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల అనంతరం నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. సహాయచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  హైదరాబాద్‌ పరిస్థితిని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ వివరించారు.
లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు.
 
కాగా, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆరాతీశారు. బుధవారం గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాట్లాడానని రాష్ట్రపతి ట్వీట్‌చేశారు. 
 
హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల కలిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు ధ్వంసమవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జాతి మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
హైదరాబాద్, తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టంపై రామ్‌నాథ్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు.