హైదరాబాద్ కు తప్పిన వాయుగుండం ముప్పు   

మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వరుణుడు ఎట్టకేలకు  శాంతించాడు. దాదాపు 30 ఏండ్ల తరువాత హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించిన వాయుగుండం కర్ణాటకకు చేరడంతో పెద్ద గండం తప్పింది. ఇప్పటికే మంగళవారం కురిసిన కుంభవృష్టికి జలదిగ్బంధమైన మహానగరం క్రమక్రమంగా కోలుకుంటున్నది.
ఈ సంవత్సరం వానల తీవ్రతను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం జూన్‌లోనే అంచనా వేసింది. సాధారణం కంటే 130 శాతం అధికంగా కురిసే అవకాశమున్నట్లు చెప్పగా వారి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం గడిచిన 14 రోజుల్లోనే 404 శాతం అధికంగా కురిసింది.
హైదరాబాద్‌లో వాతావరణ కేంద్రం ఏర్పాటైన తర్వాత  2000 సంవత్సరం ఆగస్టు 24న హైదరాబాద్‌లో నమోదు అయిన వర్షపాతం 24.1 సెంటీమీటర్లు. ఇప్పటి వరకు అదే రికార్డు. అయితే ఈ నెల 13న కురిసిన కుండపోత వర్షంతో హయత్‌నగర్‌ 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయి చరిత్రను తిరగరాసింది.
కాకినాడ నుంచి హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించిన తీవ్ర వాయిగుండం నగరాన్ని దాటి కర్ణాటకు చేరడంతో అది బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో గ్రేటర్‌లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు.
 
అయితే  వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.  
 
వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పెను విషాదాన్ని నింపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
 
 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. కల్వర్టులు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్భ ందంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది. కొన్ని రహదారులు కోతకు గురవ్వగా.. మరికొన్ని రహదారులపై భారీ సంఖ్యలో మహావృక్షాలు నేలకొరిగాయి. అంచనాలకు మించి ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.
 
భారీ వర్షంతో హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు విరిగిపడటం వల్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. అనేక చోట్ల రోడ్లకు గండ్లు పడటం వల్ల ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 
 
దీంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులకు సెలవులు ప్రకటించాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ ఇంకా పునరుద్ధరించలేదు. అటు ఇంటర్నెట్ సౌకర్య కూడా చాలా మందికి దూరమైంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో ఆర్టీసీ సేవలకు బుధవారం తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. వరద నీటితో రహదారులు జలమయం కావడంతో నగరంలోని 29 డిపోల పరిధిలోని బస్సులు బుధవారం ఉదయం బయటికి వచ్చినా తిరగలేకపోయాయి. దీంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ నేషనల్‌ పార్కులో ప్రహరీ కూలింది. జూబ్లీహిల్స్‌ వైపు పార్కుకు రక్షణగా నిర్మించిన గోడ బుధవారం సుమారు 64 మీటర్ల మేర పడిపోవడంతో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. పార్కులోని వన్యప్రాణులు బయటకు వెళ్లకుండా తాత్కాలికంగా రేకులను ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గిన తర్వాత ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నింటిని మూసివేయాలని కోరింది.